మొక్కజొన్న రైతుల గోడు పట్టదా? | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతుల గోడు పట్టదా?

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

● వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలి

● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్‌

గార/శ్రీకాకుళం రూరల్‌ : మొక్కజొన్న కొనుగోలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి వెంటనే మొక్కజొన్న కేంద్రాలను తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం గార మండలం కొత్తూరు, అచ్చెన్నపాలెం, శ్రీకాకుళం రూరల్‌ మండలం బలివాడ గ్రామాల్లో మొక్కజొన్న రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకు కొనకపోతే కలిగిన నష్టాన్ని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. పరిశ్రమ, ప్రైవేటు వర్తకులు మాట తప్పవచ్చు కానీ ప్రభుత్వమే మాట తప్పితే ఎలా అని నిలదీశారు. ఏసీ గదుల్లో ఉండటం కాదని, పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరును చూడాలన్నారు. రైతుల ఘోష మీ చెవికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. యూరియాను టీడీపీ కార్యకర్తలు బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా అధిక ధరలకు అమ్ముకున్నారని, జగన్‌ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అమ్మకాలు జరగాలని, విత్తనాలు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. రూ.280లకే దొరకాల్సిన యూరియాను రూ.700కు పక్క గ్రామాల్లో కొనుగోలు చేసుకున్నామని రైతులే చెబుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోందని, ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కాగా, రూ.1700కే కొనుగోలు చేస్తున్నారని, ఎకరాకు సరాసరి 40 క్వింటాళ్లు దిగుబడి రాగా రూ.28 వేలు నష్టపోతున్నారని చెప్పారు. జిల్లాలో రూ.240 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్ల కిందట అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మద్దతు ధరకే కొనుగోలు జరిగిందని రైతులే చెబుతున్నారని, కరోనా వంటి పరిస్థితుల్లో కళ్లాల వద్దకే వచ్చి తీసుకెళ్లారని గుర్తు చేశారు. జిల్లాలో ఓ వర్తకుడు క్వింటా రూ.1800 కంటే ఎక్కువ కొనవద్దని చెబుతున్నాడని తెలుస్తోందన్నారు. డ్యాష్‌బోర్డుపై చూడటం కాదని, పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరు చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీపీ గొండు రఘురామ్‌, నియోజకవర్గాల పరిశీలకులు చల్లా రవికుమార్‌, ఎన్ని ధనుంజయరావు, పార్టీ ఎస్‌ఈసీ మెంబర్‌ చల్ల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్‌, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు, మండల వ్యవసాయ విభాగం అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దన, బరా టం నాగేశ్వరరావు, సుంకాన సురేష్‌, గురువు అప్పలనాయుడు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement