● సత్యవరంలో గ్రామసభను
బహిష్కరించిన రైతులు
నరసన్నపేట: ‘ఎన్నో ఏళ్ల తర్వాత భూములు రీ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డులు పూర్తి స్థాయిలో సరిదిద్దరా.. భూ సమస్యలు ఎక్కడికక్కడ ఉంచేసి తూతూమంత్రంగా రీ సర్వే చేసి వెళ్లిపోతామంటే మేం సహకరించం. ఇటువంటి రీ సర్వే మాకు వద్దు. ఉన్న భూములు అన్నింటినీ రీ సర్వే చేసి సమస్యలు పరిష్కరించండి. అన్ని విధాలా సహకరిస్తాం. ప్రధానంగా సత్యవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని హెల్డోవర్ భూములను రీ సర్వే చేయాలి. లేకుంటే రీ సర్వే వద్దు’ అంటూ నరసన్నపేట మండలం సత్యవరం, దూకులపాడు, తండ్యాలవానిపేట రైతులు రీ సర్వే గ్రామసభను బహిష్కరించారు. మూడో విడతలో సత్యవరం రెవెన్యూ పరిధిలో భూముల రీ సర్వేకు అనుమతి రావడంతో బుధవారం అవగాహన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూముల సమస్యలు పరిష్కరించకపోతే రీ సర్వే ఎందుకంటూ రైతులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. వివాదాస్పద భూములంటూ కొన్నింటిని హెల్డోవర్ పేరిట ఏళ్ల తరబడి పక్కన పెట్టేశారు. వీటికి పాస్ పుస్తకాలు కావాలని అడుగుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఆరంగి మురళి మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అని గతంలో కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం 600 ఎకరాలు మాకు దకలు పడ్డాయని, ఇప్పటికీ సాగు చేస్తున్నామని, ఆ తర్వాత భూములను హెల్డోవర్‌లో పెట్టారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హెల్డోవర్ క్లియరెన్స్ చేసి 600 ఎకరాల్లో రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ పక్కన పెట్టారని తెలిపారు. ఈ భూముల్లో పట్టా పుస్తకాలు పొందిన వారు కొందరు మరణించారని, వారి పిల్లలకు పాస్ పుస్తకాలు ఇప్పించాలని విన్నవించారు. అనంతరం తహసీల్దార్ టి.సత్యనారాయణ మాట్లాడుతూ రీ సర్వేకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


