ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చీకటిలో సుమారు పది అడుగుల కింగ్ కోబ్రాను మంగళవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆందోళనకు గురైన ప్రజలు స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందివ్వడంతో స్నేక్ క్యాచర్ రామచంద్ర జగన్నాథ్ సాహు సంఘటనా స్థలానికి చేరుకొని కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకొని దగ్గర్లో ఉన్న అడవుల్లో విడిచిపెట్టారు. గత వారం రోజుల నుంచి ఒడిశా జయంతిపురం, పాత్రపురం గ్రామాల్లో భారీ కింగ్ కోబ్రాలు సంచరిస్తుండటంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది.
అంబులెన్స్‌లు ఇలా.. సేవలు ఎలా..?
పాతపట్నం: అత్యవసర సమయాల్లో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్ 108 వాహనంతో పాటు కోవిడ్ సమయంలో సీహెచ్‌సీకి అదనంగా ఇచ్చిన అంబులెన్స్ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. పాతపట్నం సీహెచ్‌సీ ఆస్పత్రిలో ఈ వాహనాలు తుప్పు పట్టి, మూలన పడి ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన అంబులెన్స్‌కు రంగులు వేసి ఉపయోగిస్తున్నారు. 108కు ఫోన్ చేస్తే అత్యవసర సేవలు అలస్యం అవుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.
నేటి నుంచి ఈయూ రాష్ట్ర మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో బుధవారం జరగనున్నాయి. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి ఈయూ నాయకులు మంగళవారం బస్సులో బయలుదేరి వెళ్లారు. యూనియన్ ముఖ్య అంశాలు, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు ఎస్.వి.రమణ, జి.వి.రమణమ్మ, సనపల శ్రీనివాసరావు, డి.సుజాత, ఎం.వనజాక్షి, డి.బి.మూర్తి, కె.వై.బాబు, ఆర్‌ఎస్‌రావు, వై.కె.కుమార్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


