గార: విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ వర్గీయులు ఆక్రమించుకుంటున్నారు. మండలంలోని శ్రీకూర్మం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో సర్వే నంబర్ 600 లో 0.12 సెంట్లు ప్రభుత్వం స్థలం ఉంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వంలో శ్రీకూర్మనాథుని దర్శనం కోసం వచ్చే దూర ప్రాంత భక్తుల కోసం ఉచిత గదులతో పాటు కల్యాణ మంటపం నిర్మించాలన్న ఆలోచనతో ఢిల్లీకి చెందిన ఆదిలీలా ఫౌండేషన్‌కు అప్పగించింది. దీనికోసం అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకుల కన్ను పడింది. నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో స్థానికులైన ముగ్గురు పేరున పట్టాలు ఇచ్చారని ప్రచారం జరిగింది. దీంతో గ్రామంలోని మంగళవారం అన్ని పార్టీలకు చెందిన పలువురు వెళ్లి నిర్మాణం జరుగుతున్న పనులును నిలిపేశారు. ప్రభుత్వం ఆదిలీలా ఫౌండేషన్‌కు ఇచ్చిన స్థలంలో ఎలా ఇళ్లు నిర్మిస్తారని నిలదీశారు. గత ఏడాది ఈ స్థలంలో నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రయత్నించగా పత్రికల్లో వార్తలు రావడతో అధికారులు నోటీసులు ఇచ్చి పనులను నిలిపేశారు. ప్రస్తుతం అధికార బలంతో పట్టాలు తెచ్చామని పనులు చేయడంపై స్థానికులు పీజీఆర్‌ఎస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.


