● తొలిసారిగా స్వీయ నమోదుకు అవకాశం
● స్వగ్రామాల్లో లేనివారికి ఉపయోగకరం
● గత గణనలో జిల్లా
జనాభా సంఖ్య
28 లక్షలు
స్వీయ నమోదు ఇలా....
స్వీయగణన కోసం ‘ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ నుంచి లింక్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ లోనికి వెళ్లి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని అందులో ఉన్న క్యాప్‌చాను నమోదు చేయాలి. అటు తరువాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేస్తే ఫార్మేట్ తెరుచుకుంటుంది. ఇందులో భాషను ఎంపిక చేసుకుని, ఓటీపీ నమోదు చేసి, లొకేషన్ వివరాలను నమోదు చేయాలి. అటు తర్వాత కుటుంబానికి సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలను నింపాలి. అన్నీ మరోసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 11 అంకెల సెల్ఫ్ యాన్యుమరేషన్ ఐడీ నెంబర్ జనరేట్ అవుతుంది. దీనిని ఓ చోట రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. జనగణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్‌ను చెబితే వారు మరోసారి చూసుకొని సబ్మిట్ చేస్తారు. ఏవైనా తప్పులు దొర్లినా, మార్పులు చేసుకోవాలన్నా సిబ్బంది సమక్షంలో సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
శ్రీకాకుళం : రాష్ట్రంలో 2011 తర్వాత చేపడుతున్న జనగణనలో తొలిసారిగా స్వీయ నమోదు ప్రవేశపెట్టారు. ప్రజలే తమ వివరాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా చేపడుతున్న జనగణన కోసం భారీ కసరత్తు జరుగుతుంది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను సేకరించేందుకు ఏర్పాటు చేశారు. మే ఒకటి నుంచి 31 వరకు మొదటి విడత లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి 15 రోజులు ముందుగా అంటే మే 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించారు. దేశ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలకంగానున్న జనగణనలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను చేస్తున్నారు. జిల్లాలో 2011 ప్రకారం 28 లక్షల జనాభా ఉన్నారు.
15 ఏళ్ల తర్వాత జనగణన..
జిల్లాలో 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. 2021లో కరోనా కారణంగా లాక్‌డౌన్ పరిస్థితుల్లో జనగణనను చేపట్టలేకపోయారు. ప్రస్తుతం 2026–27 జనగణన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే తెలియజేసింది.
డేటా గోప్యతకు ప్రాధాన్యత..
ప్రజల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు గాను స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం డిజిటల్ విధానంలో ఉంటుంది. స్థానికంగా అందుబాటులో లేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలిదశ మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరగనుండగా ఇందులో ఇళ్ల వివరాలు, సదుపాయాలను తెలుసుకుంటారు. రెండో దశలో జనాభా లెక్కింపు సామాజిక, ఆర్థిక, సాంస్కతిక స్థితిగతులు ఆధారంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ప్రక్రియ జరుగుతుంది.


