● గర్భిణులను డోలీతో మోసుకొస్తున్న
గిరిజనులు
● చిన్నారులకు తప్పని నాలుగు కిలోమీటర్ల కాలినడక
● రోడ్డు లేక మామిడిజోల గ్రామస్తుల అవస్థలు
4
సారవకోట :
ఎన్ని మారుతున్నా తమ డోలీ మోతల కష్టాలు మాత్రం మారడం లేదని సారవకోట మండలం బద్రి పంచాయతీ మామిడిజోల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేక నిత్యం అవస్థలు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొన్నేళ్ల కిందట సీతంపేట, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం మండలాలలోని పలు ప్రాంతాల నుంచి పలు కుటుంబాల గిరిజనులు బద్రి గ్రామానికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మామిడిజోల గ్రామానికి వలస వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలను చదును చేసి చీపురు, పసుపు, వేరుపనస తదితర పంటలను సాగు చేస్తూ జీవనం సాగు చేస్తున్నారు. మొదటి నుంచీ ఈ గ్రామానికి రోడ్డు సమస్య వెంటాడుతోంది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఏ కష్టమొచ్చినా కాలినడకనే సమీప గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం రోడ్డు మార్గమైనా కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
డోలీలే గతి..
గ్రామంలో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అవస్థలు తప్పడం లేదు. ప్రతి నెలా బుడితి సీహెచ్‌సీకి వైద్య పరీక్షల నిమిత్తం డోలీ కట్టుకుని మోసుకొచ్చి తిరిగి తీసుకెళ్తున్నారు. ప్రసవ సమయంలో ఆస్పత్రికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా తల్లీ, బిడ్డలకు ప్రాణాపాయం తప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2


