అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్‌కుమార్ గుప్తా కుటుంబసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ బృందం స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు.
అఖండ భారత్ లక్ష్యంగా పాదయాత్ర
రణస్థలం: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, దేశ సమైక్యతను బలపరిచి అఖండ భారత్ సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలకులు మాతా సుమనపురి పాదయాత్ర చేపట్టారు. ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్రలో భాగంగా రణస్థలం మండలం పతివాడపాలెం విచ్చేసిన ఆమెకు విశ్వహిందూ పరిషత్ సభ్యులు స్వాగతం పలికారు. ఈమె గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రోజుకు సుమారు 20 కిలోమీటర్లు నడుస్తూ ఇప్పటి వరకు రెండేళ్లు యాత్ర పూర్తి చేశారు. నాలుగు సంవత్సరాల పాటు కొనసాగే ఈ యాత్ర రామేశ్వరం వద్ద ముగియనుందని సభ్యులు తెలిపారు.
భార్యాభర్తలకు రిమాండ్
పాతపట్నం: చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి ఈ నెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలోగిడి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త జైనవలస ముఖలింగం వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం దంపతులను నరసన్నపేట కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. వీరిని అంపోలు జిల్లా జైలుకు తరలించామని ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి తెలిపారు.
ఫలసాయం హక్కులకు రీటెండర్
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ క్యాంపస్‌లో మామిడి, జీడి వృక్షాల పంట ఫలసాయం హక్కుల కోసం రీ టెండర్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ శ్రీకాకుళం పేరిట రూ.10 వేల డిపాజిట్ డీడీని జతపరచి టెండర్ కొటేషన్‌ను సీల్డ్ కవర్‌లో వర్శిటీలోని ప్రధాన పరిపాలనా భవనం వద్ద ఏర్పాటుచేసిన బాక్స్‌లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు వేయాలని సూచించారు. మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవర్లు బహిర్గతం చేసి ఎక్కువ మొత్తం చెల్లించే వారికి ఫలసాయం అందిస్తామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీరు సరికాదు
నరసన్నపేట: కూటమిలో లేని రాష్ట్రాలపై ఎస్‌ఐఆర్(సర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం దాడులు నిర్వహించడం తగదని ీసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. మంగళవారం నరసన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధ ప్రభావం ప్రజలపై పడుతోందని, ఆ భారాన్ని నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇదే సమయంలో సర్ పేరుతో కూటమిలో లేని రాష్ట్రాలపై దాడులకు దిగుతోందని విమర్శించారు. ఓటమి భయంతో అర్హులైన ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. కేరళ వంటి రాష్ట్రంలో ఇదేలా వ్యవహరించిందన్నారు. గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయని, విమాన చార్జీలు తగిడి మోపెడయ్యాయని, గ్యాస్ సరఫరాలో కేంద్రం చేతులెత్తేసిందని అన్నారు. ఓవైపు అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఆయన ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ తూట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్నా వారి రుణాలను మాఫీ చేయని మోదీ సర్కారు.. కార్పొరేట్లకు రుణ మాఫీ చేయడం దారుణమన్నారు. నరసన్నపేటలో అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయని, అధికార పార్టీ నాయకుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


