నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటకు బ్రేక్ 61 రోజుల పాటు తీర మత్స్యకారులకు విశ్రాంతి మత్స్యకార సేవల అర్హుల నిర్ధారణకు 17న సర్వే
అర్హులను ప్రత్యక్షంగా గుర్తిస్తాం
అరసవల్లి:
తీరం నిశ్శబ్దం కానుంది. ఇంజిన్ల ఘోష నుంచి సంద్రానికి విరామం లభించనుంది. మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు జిల్లాలోని సముద్ర తీరంలో వేట నిలిచిపోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీ మైరెన్ ఫిషింగ్ యాక్ట్ 1994 ప్రకారం ఏటా ఇలా ఈ 61 రోజుల పాటు వేట నిషేధ కాలంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో తీరంలో వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ‘మత్స్యకార సేవల’ కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల నగదు బదిలీ చేయనుంది. నిబంధనల ప్రకారం మోటరైజ్డ్ పడవ యజమానితో పాటు ఆరుగురు, సంప్రదాయ పడవ యజమానితో కలిపి ముగ్గురు అర్హులుగా గుర్తించి వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తుంటారు. అయితే జిల్లాలో అర్హుల సంఖ్య తగ్గిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. 2024 వరకు అర్హులుగా ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కింద భృతి పొంది న వందలాది మంది మత్స్యకారులకు 2025 జాబితాలో చోటు దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మత్స్యకార సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తిన సంగతి విదితమే.
అర్హుల గుర్తింపులో మల్లగుల్లాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఏడాది మత్స్యకార సేవల పేరుతో జమ చేసిన మొ త్తంలో పెద్ద సంఖ్యలో అనర్హులకే లబ్ధి చేకూరినట్లు గా పెద్దెత్తున విమర్శలు రావడంతో ఈసారి అర్హుల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అర్హుల సంఖ్య తగ్గింపునకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తమ వాళ్లకు ఎలాగైనా ఈ లబ్ధి అందాలంటూ స్థానిక కూటమి నేతల సిఫారసులతో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లాలోనే మత్స్యకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తుండడంతో సిఫారసుల్లో తగ్గేదేలా అంటూ కూటమి నేతలు తమ జాబితాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయానికి ఇప్పటికే చేర్చేశారు. ఎలాగైనా తమ వాళ్లు పేర్లు ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.
ఆర్థిక భారం పడకూడదని..
రాష్ట్రంలో ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల నుంచి ప్రభు త్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ అప్పులు చేస్తున్న ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమలు పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా సంక్షేమ క్యాలండర్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో మత్స్యకార సేవలే తొలి సంక్షేమ పథకం కానుంది. దీంతో ఎలాగైనా రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం కాకుండా ఉండే లా అధికారులు తగిన చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎలాగైనా అర్హుల జాబితాను తగ్గించేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయాలో.. అధికారులకు సెలవిచ్చారు. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు స్థానిక జిల్లాలో కూడా మత్స్యకార ఆర్ధిక సహాయానికి అర్హుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకే రోజున ఎన్యూమరేషన్ జరిగితే.. ఉన్నవాళ్లను మాత్రమే లెక్కించేసి, బోట్ల లెక్కల ప్రకారం అర్హుల సంఖ్యను కుదించేలా ప్రణాళికను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 17న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 11 తీర ప్రాంత మండలాల్లో ప్రత్యక్ష సమాచార సేకరణ నిర్వహించి, 23న సచివాలయాల్లో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించి, 25వ తేదీ వరకు దీనిపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఈనెల 27న తుది జాబితాను కలెక్టర్ ఆమోదించేలా సిద్ధం చేసి 30వ తేదీన ప్రభుత్వ నిర్ణయం మేరకు డీబీటీ ద్వారా నగదును అర్హుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
గత ఏడాది మత్స్యకార సేవలు పొందిన వారు
15548
తీర ప్రాంత
గ్రామాలు
104
ఫిష్ ల్యాండింగ్
సెంటర్లు
61
మత్స్యకార జనాభా సుమారు
1.40 లక్షల మంది
జిల్లాలో తీర ప్రాంత మండలాలు
11
మోటరైజ్డ్
బోట్లు
1623
ఈ ఏడాది మత్స్యకార సేవల కింద వేట నిషేధ కాలంలో తీర మత్య్సకార అర్హులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు బదిలీ కానుంది. ఈ మేరకు అర్హుల గుర్తించేందుకు ఈనెల 17న ఒక్కరోజే ఎన్యూమరేషన్ చేపట్టనున్నాం. ఈ ప్రక్రియలో కచ్చితంగా మా అధికార సిబ్బంది ప్రత్యక్షంగా వెళ్లి సమాచారాన్ని సేకరణ చేయనున్నాం. అనర్హులకు ఈ లబ్ధి అందకుండా చర్యలు చేపడుతున్నాం. – వై.సత్యనారాయణ,
డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ


