శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా వెంకటేశ్వర జ్యూయలరీ షాపులో దోపిడీ కేసుకు సంబంధించి అగంతకుల ఆచూకీ కోసం పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు బృందాలు గాలింపు చేస్తుండగా ఇప్పటికే నలుగురు నిందితులు ఒడిశాలో పట్టుబడినట్లు విశ్వసనీయ సమాచారం. వీరి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేలా విచారణాధికారులు కృషి చేస్తున్నారు. దుండగులు ఉపయోగించిన కారును సైతం ట్రేసవుట్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ దోపిడీలో స్థానికుల హస్తం సైతం ఉందన్న కోణంలో కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కాశీబుగ్గ వ్యాపార వర్గాల్లో ఈ దోపిడీ కాస్తా కలకలం రేపిందనే చెప్పాలి. పన్నుల అధికారులు సైతం నిఘా పేరిట కన్నేయడంతో జీఎస్టీలు ఎగ్గొట్టి వ్యాపారాలు చేస్తున్న వారు కలవరపడుతున్నారు.


