ప్రమాదకరం
● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● విచ్చలవిడిగా దాడులు చేస్తున్న వైనం ● బెంబేలెత్తిపోతున్న ప్రజలు
హిరమండలం:
జిల్లాలో కుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతిచోట స్వైర విహారం చేస్తున్నా యి. పట్టణాల్లోని ప్రధాన రహదారులు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో సైతం గుంపులుగా సంచరిస్తూ అటువైపుగా వచ్చేవారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అధికారులు శస్త్ర చికిత్సల పేరుతో లక్షలా ది రూపాయలు ఖర్చు చేసినట్టు గణాంకాలు చూపిస్తున్నారే తప్ప, వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదు. గతేడాది 43,294 మంది కుక్కకాటు బాధితులుగా జిల్లాలో నమోదయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది ఎక్కువగా..
జిల్లాలో గతేడాది జనవరి, ఫిబ్రవరి, నవంబర్‌లో ఎక్కువగా కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. వేసవిలో కొంత తగ్గాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వీటి బెడద ఎక్కువగా ఉంది. ఆయా చోట్ల వీటి నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల శ్రీకాకుళంలోని సర్వజన ఆస్పత్రిని ప్రపంచ బ్యాంకు సర్వే బృందం సందర్శించింది. ఆ సమయంలో కుక్కకాటు బాధితుల ఓపీ చూసి ఆశ్చర్యపడింది. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మేజర్ పంచాయతీలు కొనసాగుతున్నాయి. 777 పంచాయతీలుగా ఉన్నాయి. అయితే మున్సిపాలిటీల్లో అస్సలు కుక్కల నియంత్రణ చర్యలు కానరావడం లేదు. కుక్కల నియంత్రణకుగాను వాటి సంరక్షణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు, వాటికి ఆహారం వంటివి సమకూర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క శ్రీకాకుళం నగరంలో 2021 నుంచి 2025 వరకు రూ.73.8 లక్షలు ఖర్చుచేసి 5,203 శస్త్రచకిత్సలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ మిగతాచోట్ల మాత్రం అటువంటివేమీ కనిపించడం లేదు. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కుక్కకాటు చాలా ప్రమాదక రం. కరిచిన వెంటనే యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు వేసుకోవాలి. హిరమండలంలో ఇటీవల 10 మంది కుక్కకాటుకు గురయ్యారు. వారికి తక్షణ వైద్య సాయం అందించాం. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందికర మే. అందుకే కరిచిన వెంటనే ఆస్పత్రికి రావాలి.
– పి.సాయికుమార్, వైద్యాధికారి,
హిరమండలం పీహెచ్‌సీ


