మెళియాపుట్టి: మండలంలోని గొప్పిలి గ్రామానికి చెందిన బూరగాపు వెంకటరమణ తన 10 ధాన్యం బస్తాలు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఉంచాడు. అయితే ఒక బస్తా కనబడడం లేదని.. ఎవరో దొంగిలించారని తిట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో బూరగాపు విజ్ఞపతి అనే యువకడు అదేచోట ఉండడంతో తననే తిడుతున్నాడని వృద్ధుడిపై దాడి చేశాడు. దీంతో వృద్ధుడి కాలుకి గాయమవ్వడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఎస్‌ఐ మహ్మద్ అమీర్ అలీ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు.
గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి
బూర్జ: మండలంలోని బూర్జ గ్రామానికి చెందిన చుక్కర తౌవుడు(70) గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చుక్కర తౌవుడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని, రెండు ఎకరాల్లో వరిపంట, మరో రెండు ఎకరాల్లో అరటి పంటలు వేశాడు. ఇటీవల వడగండ్లతో ఆకాల వర్షం పడడంతో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. వరిపంటకు కూడా తీవ్రనష్టం జరిగింది. దీంతో అప్పులు పాలయ్యానని మనస్థాపం చెందాడు. ఈనెల 10వ తేదీన ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. సాగు చేసిన పొలం వద్దకు వెళ్లి చూడగా అతడు గడ్డిమందు తాగినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య చుక్కర లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.ప్రవల్లిక తెలిపారు.


