శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నవారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో చోటు కల్పిస్తూ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు అమిరుల్లా బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణయాదవ్ అన్నారు. కలిసికట్టుగా బీసీల హక్కుల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా సంఘ కార్యదర్శిగా దండి పాపారావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా బలివాడ కళావతి, నగర మహిళా అధ్యక్షురాలిగా గొల్తి పద్మావతికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎల్.నాగరాజు, కర్రి రంగాజీదేవ్, రహీమ్, మరలా శంకరరావులు శుభాకాంక్షలు తెలిపారు.
జీడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
నరసన్నపేట: జీడి మద్దతు ధర కేజీకి రూ.200 ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం పోతయ్యవలసలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జీడి పంటకు బయట మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, అయితే ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. ఖర్చులు పెరిగి.. దిగుబడులు తగ్గి రైతులు నష్టాలకు గురి అవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు గదిలి రేయన్న పాల్గొన్నారు.
ఖైదీల కుటుంబాలకు భరోసా
శ్రీకాకుళం పాతబస్టాండ్: నేర బాధితులతో పాటు జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ‘స్పృహ’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సదన్‌లో ప్రభుత్వ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబాలు, నేర బాధితులకు చట్టపరమైన సలహాలతో పాటు మానసిక, విద్యా, ఆర్థిక సామాజిక మద్దతును ఈ పథకం ద్వారా అందిస్తామన్నారు. ముఖ్యంగా ఖైదీలపై ఆధారపడిన పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో వారిపై ఉన్న అపవాదును తొలగించి, ఆత్మగౌరవంతో జీవించేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ప్రస్తుత సంక్షేమ పథకాలలోని లోపాలను గుర్తించి, బాధితులకు నేరుగా ఫలాలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయ ప్రతినిధులు, జైలు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు పాల్గొన్నారు.
ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో పీకే ఎంటర్‌టైన్మెంట్ నిర్వహణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ అకాడమీ రచయిత్రి, దర్శకురాలు పెమ్మరాజు పూర్ణిమ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ఆద్యంతం అలరించింది. ప్రతి కుటుంబాన్ని నడిపించి, గెలిపించే సీ్త్రని కూడా సీ్త్ర మాత్రే నమః అని పూజించాలనే సందేశంతో ప్రదర్శన సాగింది. పెందుర్తికి చెందిన నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ బి.శెట్టి శేఖర్ దర్శకత్వంలో చందు తులసి రచనలో ‘నీళ్లు– నీళ్లు‘ నాటికలో ప్రస్తుత కాలంలో గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని పేర్కొంటూ నటీనటులు అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆహూతులను అలరించింది. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, నిక్కు హరిసత్యనారాయణ, పొగిరి సత్యం, పూజారి మన్మధరావు, ఉంగటి రమణమూర్తి, పాత్రుని పాపారావు, సనపల అన్నాజిరావు, పొగిరి సుగుణాకరరావు, నల్లి ధర్మారావు, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి పాల్గొన్నారు.


