శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
జనసేనకు మరోసారి భంగపాటు తప్పలేదు. కూటమి పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న తీరును జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ కృషితో నిర్మించిన కార్గిల్ పార్కును ఆయన లేకుండానే ప్రారంభించడం ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా కొత్తరోడ్డు వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోష్ విగ్రహాన్ని సుడా నిధులతోనే ఏర్పాటు చేసినప్పటికీ చైర్మన్ కొరికాన లేకుండానే ప్రారంభించడం, ప్రోటోకాల్‌ను బహిరంగంగా తుంగలో తొక్కయడంపై జనసైనికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జనసేనను పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే కూటమి ధర్మానికి ద్రోహం చేసినట్టేనని వాపోతున్నారు.
అప్పుడూ..ఇప్పుడూ..
సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అందుబాటులో లేని సమయంలో పనులు పూర్తి కాకముందే కార్గిల్ పార్క్‌ను హడావుడిగా ప్రారంభించేశారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ రవికుమార్‌కి పూర్తిగా ఆహ్వానం లేకుండా నేతాజీ విగ్రహం ప్రారంభించడం పట్ల జనసైనికులతో పాటు కాపు కులానికి చెందినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం రోజునే కొత్తరోడ్డు వద్ద సుడా నిధులతో ఏర్పాటుచేసిన నేతాజీ విగ్రహావిష్కరణ చేద్దామనుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ అందుబాటులో లేరని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా చైర్మన్‌కు ఆహ్వానం అందించకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీకి ఒక న్యాయం, మిత్రపక్షానికి మరో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్గిల్ పార్క్ ప్రోటోకాల్ వివాదంపై జనసేన పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని..కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు భోగట్టా. కాగా, నేతాజీ విగ్రహం ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, విప్ బెందాళం అశోక్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్‌లు హాజరయ్యారు. కూటమికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ లేకపోవడం గమనార్హం.
సుడా నిధులతో నేతాజీ విగ్రహం ఏర్పాటు
చైర్మన్ కొరికాన లేకుండానే ప్రారంభించిన టీడీపీ నాయకులు
మండిపడుతున్న జన సైనికులు
నేతాజీ విగ్రహం ప్రారంభోత్సవంలో కానరాని జనసేన, బీజేపీ నేతలు


