మనసు కరిగేనా.. గొంతు తడిచేనా..? | - | Sakshi
Sakshi News home page

మనసు కరిగేనా.. గొంతు తడిచేనా..?

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

ఆమదాలవలస మున్సిపాలిటీలో దాహం కేకలు

ట్యాంకర్‌ ద్వారా వారంలో

రెండు రోజులు మాత్రమే తాగునీరు

తీవ్ర ఆవేదన వ్యక్తం

చేస్తున్న మహిళలు

ఆమదాలవలస:

మదాలవలస.. ట్యాంకర్‌ ముందు వరస కడుతోంది. కనీసం వారానికి రెండుసార్లు ఇలా నించుంటేనే పురపాలిక గొంతు తడుస్తుంది. మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు పార్వతీశ్వరుని పేట, జగ్గుశాస్త్రులపేట, 6వ వార్డు సప్తపురాలు, 5వ వార్డు పంతులపేట, రెడ్డి పేట, సొట్టవానిపేట, 7వ వార్డు చింతాడ తదితర ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారానికి రెండుసార్లు మాత్రమే ట్యాంకర్లతో తాగునీరు అందిస్తుండడంతో ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని బిందెలతో రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకర్లతో నీరు అందించడంలో గ్యాప్‌ వచ్చిందని, గత ప్రభుత్వంలో ప్రతి రోజూ తాగునీరు అందించేవారని ప్రజలు, మహిళలు చెబుతున్నారు.

తాగునీటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో 15 రక్షిత మంచినీటి పథకాలు నిర్మించి తాగునీరు అందించే ఏర్పాట్లను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేశా రు. కొన్ని ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నందున మూడు ట్యాంకర్లతో అప్పట్లో నీరు సరఫరా చేసేవారు. 23 వార్డులకు పూర్తిస్థాయిలో నీరిచ్చేవారు. తిమ్మాపురం, జగ్గుశాస్త్రులపేట, చొట్టవానిపేట, ఊసవానిపేట, గేదెలవానిపేట, చింతాడ, పంతులపేట, లక్ష్ముడిపేట, వెంకయ్యపేట, సొట్టవానిపేట, గేదెలవానిపేట తదితర ప్రాంతాల్లో 15 రక్షిత మంచినీటి పథకాల ద్వారా నిత్యం తాగునీరు అందించేవారు. ప్రభుత్వం మారాక పనుల నిర్వహణ ఆగిపోయింది. దీంతో పాటు ట్యాంకర్లతో నీరివ్వడం కూడా తగ్గిపోయింది. ఇటీవల ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి పార్వతీశ్వరుని పేట తదితర గ్రామాల ప్రజలు విన్నవించారు కూడా.

నీరు లేక ఇబ్బంది..

శివారు ప్రాంతాలకు తాగునీరు రావడం లేదు. రెండురోజులకు ఓ సారైనా నీరివ్వాలి. నీరు లేక ఇబ్బందిగా ఉంది.

– నాగమ్మ ,

చింతాడ ముస్లిమ్‌ కాలనీ, మున్సిపాలిటీ 7వవార్డు

చర్యలు తీసుకుంటాం

మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ఉన్న వనరులతో తాగునీరు అందిస్తున్నాం. వేసవి కాలం దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు నా వంతు కృషిచేస్తాను. ప్రజలు కూడా సహకరించాలి.

– టి.రవి, మున్సిపల్‌ కమిషనర్‌, ఆమదాలవలస

Advertisement
 
Advertisement
Advertisement