వజ్రపుకొత్తూరు రూరల్: లేత చిగురు, పూత, పింది దశలో రైతులు మోతాదుకు మించి రసాయన, పురుగు మందులు వినియోగించడంతో తోటలు సహజ గుణాన్ని కోల్పోయి జీడి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని జీడి మామిడి పరిశోధన స్థానం (బాపట్ల) సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ జి.స్రవంతి, ఉద్యాన పరిశోధన స్థానం(పెద్దపేట) తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త టి.రాజశేఖరం అన్నారు. మండలంలో గల గరుడబద్ర, బైపల్లి, అక్కుపల్లి, చీపురపల్లి గ్రామాల్లో వారు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తో టలను పరిశీలించారు.
అలాగే జీడి పంటలను అశించే తెగుళ్లు, కీటకాలు, పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే పంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది వర్షాలు అనుకూలించకపోవడంతో పంట పూత ఆలస్యమైందని అన్నారు. అలాగే ఉష్ణోగ్రతలు పెరగడంతో పిందె కాపు తగ్గిందని తెలిపారు. వీటి ప్రభావంతో ఈ ఏడాది పంట దిగుబడి 40 శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుతం పంటకు పూతమాడు తెగులు 20 శాతం, పిండినల్లి 15 శాతం సంక్రమించినట్లు గుర్తించామని తెలిపారు. వీటి నివారణకు అజాదిరచ్తిన్ ప్రతీ లీటర్ నీటికి రెండు ఎంఎల్, ప్రోఫెనోఫోస్ ప్రతి ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ మోతాదులో కలిపి పంటకు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యానశాఖ అధికారి కె.శంకర్‌దాస్, సచివాలయ ఉద్యాన శాఖ సిబ్బంది, అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.


