12వ పీఆర్‌సీ అమలు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

12వ పీఆర్‌సీ అమలు చేయాలని వినతి

Mar 29 2026 6:49 AM | Updated on Mar 29 2026 6:49 AM

12వ పీఆర్‌సీ అమలు చేయాలని వినతి కార్గో ఎయిర్‌పోర్టుతో రోడ్డున పడతాం 30న మార్గదర్శకులకు సత్కారం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్రంలో 12వ పీఆర్‌సీని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పీఆర్‌సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల పైబడి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్‌ సిక్స్‌ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమాంలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్‌, జిల్లా కార్యదర్శి బి.రవికుమార్‌, జి.సురేష్‌, జిల్లా నాయకులు బి.శ్యాం, వైకుంఠరావు, ఎల్‌.అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

మందస : కార్గో ఎయిర్‌పోర్టు వల్ల విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడతామని మందస మండలం రాంపురం పంచాయతీ రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం, తహశీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు వల్ల గ్రామంలో 115 మంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, ఉపాధి కోల్పోయి కోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఉత్తమ సేవలందించిన మార్గదర్శకులకు ఈనెల 30న సత్కరించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం వెల్లడించారు. జీరో పోవర్టీ పి–4 కార్యక్రమం ద్వారా మార్గదర్శులు బంగారు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం మార్చి 30 నాటికి సంవత్సరం పూర్తిచేసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన, అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో శాసన సభ్యుల అధ్యక్షతన సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement