కేజీబీవీలు పిలుస్తున్నాయి | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలు పిలుస్తున్నాయి

Mar 9 2026 7:17 AM | Updated on Mar 9 2026 7:17 AM

ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

ప్రతి పాఠశాలలో 40 సీట్లు భర్తీ

హిరమండలం: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 25 కేజీబీవీల్లో ఆరో తరగతిలో 1000 సీట్ల ను భర్తీ చేయనున్నారు. అనాథలతో పాటు బడి బయట ఉన్నవారు, బడి మానేసి చదువుకు దూరంగా ఉన్న బాలికలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 30 మండలాల పరిధిలో 25 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో ఆరు నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ విద్యాబోధన సాగుతోంది. ప్రస్తుతం ఆరో తరగతికి సంబంధించి ఒక్కో పాఠశాలలో 40 సీట్ల ను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన 1000 సీట్లను భర్తీ చేస్తామని అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మెనూ ప్రకారం భోజనం, పౌష్టికాహారం, సురక్షిత నీరు, ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫారం, ఆత్మరక్షణ కోసం అవసరమయ్యే విద్యను సైతం అందిస్తారు. ఈ–విద్యను సైతం బోధిస్తారు.

ఇలా చేయాలి..

ఉచిత వసతితో పాటు నాణ్యమైన విద్యను పొందేందుకు ఇది మంచి అవకాశం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. http:apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తుది గడువు ఏప్రిల్‌ 1. ఎంపిక జాబితాను ఏప్రిల్‌ 13న ప్రకటిస్తారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నవారు అర్హులు. వివిధ కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన బాలికలు సైతం దరఖాస్తు చేసుకోవ చ్చు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు మించి ఉండకూడదు. ఓసీలకు 15 శాతం అంటే 15 సీట్లు, బీసీలకు 29 శాతం అంటే 10 సీట్లు, ఎస్సీలకు 15 శాతం అంటే 5 సీట్లు కేటాయిస్తారు. మిగతా వర్గాల వారికి మరో 10 సీట్ల కేటాయింపు ఉంటుంది. అనాథ పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది.

మంచి అవకాశం

పేద, సామాన్య బాలికలకు ఇదో మంచి అవకాశం. కేజీ బీవీల్లో ఉత్తమ విద్యాబోధన తో పాటు పౌష్టికాహారం అందిస్తాం. సీబీఎస్‌ఈ బోధనతో పాటు ఆత్మరక్షణకు సంబంధించి విద్యను సైతం అందిస్తాం.

– కృష్ణవేణి, కేజీబీవీ ప్రత్యేకాధికారి,

హిరమండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement