కవిటి: ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత లేదని, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నెలకొన్న ప్రభుత్వ వైద్య సేవలపై గతంలో పలుసార్లు ప్రస్తావించిన అంశాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి మరోసారి తెచ్చానని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బారువ మేజర్ పంచాయతీలో గత ప్రభుత్వం రూ.6 కోట్ల 60 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టి 90 శాతం నిర్మాణాలు పూర్తిచేసిందని, మెడికల్ సామగ్రి సైతం చేరుకుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తే, సముద్ర తీరం వెంబడి ఉన్న వేలాది మంది మత్స్యకారులకు వైద్య సదుపాయం అందుతుందన్నారు. పాత ఆసుపత్రి గదుల్ని కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రంగా మార్చాలని కోరారు.


