చర్యలు తీసుకుంటాం
అధికారులు స్పందించాలి
● నరసన్నపేటలో విచ్చలవిడిగా ఆక్రమణలు ● కాలువ గట్లపై కబ్జాకోరుల కన్ను ● పట్టించుకోని అధికారులు
నరసన్నపేట:
నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పట్టణంలో ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతుండగా.. తాజాగా కబ్జాకోరుల దృష్టి వంశధార కాలువలపై పడింది. జమ్ము కూడలి వద్ద నరసన్నపేట బ్రాంచ్ కెనాల్(ఎన్‌బీసీ), కిళ్లాం చానల్‌కు ఆనుకొని స్థలాలను యథేచ్ఛగా కొట్టేసే యత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వంశధార అధికారులు కనీసం స్పందించడం లేదు.
జమ్ము కూడలి వద్ద ఎన్‌బీసీ చానల్ గట్టుకు ఆనుకొని నిమ్మాడకు చెందిన ఒకరు ఇటీవల అపార్ట్‌మెంట్ నిర్మించారు. గట్టును తమ అపార్ట్‌మెంట్‌కు రోడ్డుగా మార్చుకున్నారు. ఇప్పుడు రోడ్డుకు అపార్ట్‌మెంట్‌కు మధ్య ఉన్న స్థలాన్ని ఆక్రమించుకొని ఫిల్లర్స్ వేశారు. ఇది పక్కాగా వంశధారకు చెందిన స్థలమని స్థానికులు అంటున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు మరింత ముందుకు వెళ్తున్నారు. అలాగే దీనికి సమీపంలోనే కిళ్లాం చానల్‌కు ఆనుకొని ఉన్న స్థలాలను ఆక్రమణదారులు వదలడం లేదు. కాలువను కప్పేసి తమకు నచ్చినవిధంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇదే చానల్ వద్ద పాత ఎన్‌హెచ్ రోడ్డుకు ఆనుకొని గతంలో స్థానికులు ఒక దాబా నిర్మించారు. దీంట్లో కూడా కాలువ స్థలం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అందువలన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆక్రమణల విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో జేఈలు పరిశీలించారు. తహసీల్దార్‌కు లెటర్ పెట్టాం. సర్వేయర్ వచ్చి కొలతలు వేస్తే దాని ప్ర కారం మార్కింగ్ చేసి ఆక్రమణలు తొలగిస్తాం. కిళ్లాం చానల్‌కు ఆనుకొని ఉన్న ఆక్రమణలు కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.
– మురళి, వంశధార డివిజన్ ఈఈ, నరసన్నపేట
వంశధార కాలువలు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయి. వంశధార అధికారులు సరైన దృష్టి పెట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసా గితే మరింతగా కాలువలు చిక్కిపోయే ప్రమా దం ఉంది. దీనివలన దిగువనున్న రైతులకు సక్రమంగా సాగునీరు అందకపోవచ్చు. ఇప్పటికై నా వంశధార అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – కనలప శేఖరరావు,
కోమర్తి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు


