ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ, శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని నందగిరిపేట, నాదానపురం గ్రామాల్లో చిట్టోడు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, జేసీబీలు, వాహనాలతో గత కొన్ని రోజులుగా ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు. ఆయా వార్డు, గ్రామాల్లోని కొందరు టీడీపీ కార్యకర్తలు మట్టి మాఫియాగా ఏర్పడి మట్టి తవ్వకాలు చేపడుతూ జేబులు నింపుకొంటున్నారు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారికి తెలిసే ఈ దందా కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మట్టిదందాను అడ్డుకోవాలని స్థానికులు ప్రయత్నించగా.. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు మట్టిని వారికి సంబంధించిన సైట్‌లలో వేస్తున్నామని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు సంబంధించిన సైట్‌లలో వేస్తున్నామని టీడీపీ నాయకులు సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.


