● మిస్సమ్మ..
● టెక్కలిలో మిస్సమ్మ బంగ్లా స్థలం పై భిన్నమైన వాదనలు
● ఆ స్థలం తమదేనంటున్న ఉత్తర విశాఖ సర్వోదయ సమితి సభ్యులు
● కాదు ప్రభుత్వ స్థలం అంటున్న అధికారులు
టెక్కలి:
టెక్కలి నడిబొడ్డున మిస్సమ్మ బంగ్లా స్థలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు జంగిల్ క్లియరెన్స్ చేయడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఈ స్థలం పూర్తిగా రెవెన్యూ పోరంబోకు అంటూ ఉన్న తాధికారులు చెబుతుండగా, అది పూర్తిగా ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందిన స్థలం అంటూ దశాబ్దాల క్రితం నుంచి సమితి సభ్యులుగా ఉన్న కొంత మంది కుటుంబాలకు చెందిన వ్యక్తులు చెబుతున్నారు. అంతే కాకుండా న్యాయ స్థానాలను ఆశ్రయించారు. అయితే అసలు ఈ స్థలం ప్రభుత్వానిదా, లేక ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందినదా అనే చర్చ పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా మిస్సమ్మ బంగ్లా స్థలం ప్రభుత్వానికి చెందినదిగా స్వాధీనం చేసుకుని ఓ పెద్ద నాయకుడికి, ఆయనతో పాటు మరి కొంత మందికి ఆ స్థలాన్ని లీజు పేరుతో కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు.
గాంధీజీ ఆశయంతో సమితి ఏర్పాటు
మిస్సమ్మ బంగ్లా స్థలంపై ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందిన సభ్యుల కుటుంబీకులు చెప్పిన వివరాలు ప్రకారం.. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ దుస్తుల వినియోగం ఉద్యమంలో మెళియాపుట్టికి చెందిన స్వాతంత్య్ర ఉద్యమకారు డు రాజన్న రెడ్డి నేతృత్వంలో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా 1949 లో ఉత్తర విశాఖ సర్వోదయ సమితిని స్థాపించి 1973లో టెక్కలిలో ప్రస్తుతం ఖాధీ బాండార్‌గా పిలుస్తున్న స్థలంలో కేవీఐసీ సహకారంతో సుమారు 281 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీని నిర్వహణ కోసం ప్రెసిడెంట్ సుగ్గు శ్రీనివాస్ రెడ్డితో పాటు 9 మంది సభ్యులను ఏర్పాటు చేశారు. ఇందులో చరకా, మగ్గం ద్వారా వస్త్రాలు తయారు చేసే శిక్షణ ద్వారా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేవారు. మొత్తం స్థలంలో కొంత భాగంలో ప్రస్తుతం ఉన్న స్టేట్‌బ్యాంక్‌కు అద్దెకు ఇచ్చారు. కొన్ని దశాబ్దాల కాలంగా సమితి నిర్వహణ కొనసాగింది. ఆ తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయా యి. ప్రస్తుతానికి సుమారు 1.75 ఎకరాల్లో స్థలం ఉన్నట్లు చెబుతున్నారు.
‘మిస్సమ్మ బంగ్లా స్థలం
ప్రభుత్వానిదే..’
మిస్సమ్మ బంగ్లా స్థలం పూర్తిగా ప్రభుత్వానిదేనని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల టెక్కలి ఆర్డీఓ నేతృత్వంలో స్థలాన్ని పరిశుభ్రం చేశారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేయడాన్ని అడ్డుకునేందుకు అ న్ని విధాలుగా ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించా రు. స్థలంలో ఎలాంటి ఆక్రమణలు లేకుండా 2019 లో రెవెన్యూ అధికారుల నేతృత్వంలో స్థలాన్ని పరిరక్షించేందుకు సీజ్ చేసిన సంగతిని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలం పరిరక్షణ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగానో సహకరించినట్లు వెల్లడించా రు. ఈ స్థలం ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొంత మంది న్యాయ స్థానాలను ఆశ్రయించినప్పటికీ వా రికి ఫలితం కనిపించలేదని పేర్కొన్నారు. పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈ స్థలాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మంత్రికి అప్పగించేందుకు ప్రయత్నాలు..?
టెక్కలిలో కోట్లాది రూపాయల విలువ కలిగిన ఉత్తర విశాఖ సర్వోదయ సమితి స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా స్వాధీనం చేసుకుని ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, మరి కొంత మంది కార్యకర్తలకు స్థలాన్ని కట్టబెట్టడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా ఆ స్థలం ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందిన విషయం అందరికీ తెలిసిందే. సమితి కార్యకలాపాలు నిలిచిపోయిన విషయాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పటికే ఆర్టీసీ స్థలాన్ని ఇదే మాదిరిగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెక్కలి జగతిమెట్టకు ఎదురుగా ఇటీవల వివాదంగా మారిన స్థలాన్ని కూడా కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో కొన్ని స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా స్వాధీనం చేసుకుని వాటిని మంత్రికి దారాదత్తం చేసే ప్రయత్నాల పై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఆధారాలు సేకరించాం.
– పేరాడ తిలక్,
వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి


