ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
పలాస: రామకృష్ణాపురం వద్ద సత్యసాయి విద్యావిహార్‌లో ఇటీవల రూ.లక్షా 40వేలు విలువైన ఐరన్ పోల్స్‌ను దొంగిలించిన కేసులో గౌరీశంకర్, మోహనరావు, తాతారావు, ప్రకాశరావు అనే నలుగురిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపరచగా పాతపట్నం సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు.
అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలను ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్‌ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, కమర్షియల్ ఏడీఈ రామ్మోహన్, డీ–1 ఏఈ జె.సురేష్‌కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : కుశాలపురంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు బి.జానకిరామయ్య, విక్టర్‌పాల్, అధ్యాపకులు దామోదరరావు, డి.మురళీకృష్ణ, ఇన్‌చార్జ్ పీడీ ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్: మునసబుపేట గాయత్రీ కళాశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబొ మ్మాళి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు(60), అనపాన గణేష్ ద్విచక్రవాహనంపై కోటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాయత్రీ కళాశాల సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న భాస్కరరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ


