జాగ్రత్తలే శ్రీరామరక్ష
ఆమదాలవలస/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు ముంపునకు గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సంరక్షణకు ఆమదాలవలసలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాయ్‌లు రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం వరి పంట 1.45 లక్షల హెక్టార్లలో సాగులో ఉందని, వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే, దశ కోత దశలలో ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వరి పంట
ఎం.టి.యు–1061, ఎం.టి.యు–1318, స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204 వంటి రకాలు పూత దశలో ఉన్నాయి. వర్షాల వల్ల పూత దెబ్బతినడంతో పాటు గింజలు ఏర్పడకపోవడం, రంగు మారడం, మాగుడు తెగులు రావడం, నిద్రావస్థ తొలగి మొలకలు వచ్చే ప్రమాదముంది. దీని నివారణకు పొలాల్లో నీరు నిల్వ కాకుండా వెంటనే కాలువల ద్వారా తొలగించాలి. ఎండాకు, మాగుడు తెగులు నివారణకు తగిన ఫంగిసైడ్ పిచికారీ చేయాలి. పాలు పోసుకునే దశలో పంటలు పడిపోతే నీరు నిల్వ కాకుండా మోటారు ద్వారా నీటిని బయటకు పంపించాలి. గింజల రంగు మారడం మాగుడు తెగులు నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో ఉంటూ కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి. కోత దశలో ఉండి పంట నేలపై పడిపోతే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలువలు ఏర్పాటు చేయాలి. గింజ మొలకలు రాకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం పనలపై పిచికారీ చేయాలి. సాంబ మసూరి వంటి నిద్రావస్థ లేని రకాలలో వారం రోజుల పాటు నీరు నిలిచితే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉంది. వర్షాల అనంతరం పొలాల్లో నీటిని తొలగించి ఫంగిసైడ్/ఉప్పు ద్రావణం వినియోగిస్తే నష్టం తగ్గించుకోవచ్చు.
పత్తిపంట
పత్తి కాయపగిలే దశలో ఉన్నందున, వర్షాలు తగ్గిన వెంటనే మురుగు నీరు తొలగించి నేల ఆరేలా చూడాలి. 2శాతం యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పోషక లోపాలను సవరించవచ్చు. కాయకుళ్లు నివారణకు ముందు జాగ్రత్తగా మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా/లీటరు నీటికి) పిచికారీ చేయాలి.
మొక్కజొన్న
మొక్కజొన్న కోత దశలో ఉంటే వెంటనే కోత చేపట్టాలి. తడిసిన కండెలను పలుచగా పేర్చి ఆరబెట్టి నూర్పిడి చేయాలి. కోతకు చేరువలో ఉన్న పంట పడిపోతే నీటిని బయటకు పంపించాలి. తర్వాత ప్రొపికోనాజోల్ (1 మి.లీ/లీ) గానీ, హెక్సాకొనజోల్ (2 మి.లీ/లీ) గానీ పిచికారీ చేయాలి. నూర్పిడి కోసం ఆరబెట్టిన తడి కండెలపై మొలక రాకుండా 5శాతం ఉప్పును పలుచగా చల్లి కలపాలి.
ఉద్యానపంటలు
అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటల తోటలలో నిల్వ ఉన్న నీటిని త్వరగా బయటకు తీసివేయాలి. అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు అరికట్టేందుకు ప్రొపికోనాజోల్ గానీ, మాంకోజెబ్ గానీ పిచికారీ చేయాలి. బొప్పాయి, కూరగాయ నారుమడుల్లో వేరు కుళ్లు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ (3 గ్రా/లీ) మొక్కల మొదళ్ల వద్ద పోయాలి.
ఆక్వా
చేపలు, రొయ్యల పెంపకందారులు వర్షాల సమయంలో మేతను 50 శాతం వరకు తగ్గించి, చెరువు గట్లను గట్టిపరచుకోవాలి. వర్షాలు అనంతరం నీటిలో పీహెచ్ తగ్గితే సున్నం వాడకం, ఆక్సిజన్ తగ్గితే ఎయిర్షన్ పెంచుకోవాలి. చేపలు, రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా విటమిన్ సి, ప్రోబయోటిక్స్ వాడాలి.
నీటమునిగిన పొలాలు
జలమయమైన తోటలు
అప్రమత్తంగా ఉండాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు


