గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుల్బా గ్రామానికి చెందిన మహిళ మిక్కికుమారి మాలిక్‌ను మంగళవారం సుమారు రూ.55వేలు విలువైన 11 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు చెప్పారు. ఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మాల్యాద్రి సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ మహిళ కనిపించింది. ట్రాలీ బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కళాశాలలో తనిఖీలు
ఇచ్ఛాపురం: పట్టణంలోని స్వర్ణభారతి జూనియర్ కళాశాలను ఆర్‌ఐఓ తవిటినాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ల్యాబ్‌లను పరిశీలించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చాట్ల తులసీదాస్, రాము, ప్రిన్సిపాల్ జె.జయప్రకాష్, సందీప్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి లంచాలకు తావు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీబీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వి.రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు ఏసీబీ విజిలెన్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కె.భాస్కరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎం) గోదామును ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మంగళవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టరేట్‌లో ఉన్న గోదామును ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ ఔదార్యం
శ్రీకాకుళం కల్చరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ఇండియన్ రెడ్‌క్రాస్ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు ఆదేశాల మేరకు సంతబొమ్మాళి మండలం ఆర్.సన్నపల్లి, ఎం.సన్నపల్లి, పాత మేఘవరం, ఎం.మేఘవరం, మరువాడ, మూలపేట, గులిగిపేట, లక్కీవలస, గిద్దలపాడు తదితర గ్రామాల్లో వలంటీర్లు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. పలుచోట్ల టార్పాలిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ జి.రమణ, పి.సుజాత, ఎన్.హర్షవర్ధన్, పి.వెంకటరమణ, పి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు


