
రాష్ట్రంలో నిర్బంధ పాలన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అనుకూల మీడియాపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన చల్ల శ్రీనివాసరావు అభినందన సభ శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించామన్నారు. పేదవాడు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ఆయుధమని నమ్మిన వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డిలు తమ పాలనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అటువంటి ఇంగ్లిష్ మీడియం విద్యపై కక్షగట్టి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు.
రాజకీయాలంటే డబ్బు సంపాదన కాదు..
కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదవాడికి వైద్యం అందకుండా చేయడం సరికాదని ధర్మాన అన్నారు. ఎంతోమంది జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు ఒక్క అనారోగ్యంతో మొత్తం కోల్పోతున్నారని చెప్పారు. రాజకీయాల్లో పదవులు చేపట్టడం అంటే డబ్బులు సంపాదించుకోవచ్చన్న అపోహ చాలా మందిలో ఉందని, అలాకాకుండా సమాజానికి సేవ చేసే అదృష్టంగా భావించాలన్నారు. రాజకీయ పార్టీ కోసం కష్టపడి పనిచేసి న్యాయం చేయగలిగితేనే పదవులకు సార్ధకత చేసినట్టవుతుందన్నారు. పార్టీలో కష్టాలు, గుర్తింపు ఉంటాయని, అన్నింటినీ ఒకేలా స్వీకరిస్తేనే రాజకీయాల్లో రాణించగలమన్నారు. ప్రతిపక్షంలో వచ్చే అవకాశాలు ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో పదవులొస్తాయని వాటిని సక్రమంగా వాడుకుని నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చేందుకు రెండు వేలు మంది జనాభా ఉన్న ప్రతిగ్రామంలో సచివాలయాలు నిర్మించి అనేక సేవలు అందించగలిగామన్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో చేయలేనివి జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసి చూపించారన్నారు.
అన్యాయాలను ప్రశ్నిస్తే కేసులా?
అధికార పార్టీ నాయకులు ఎంతోమంది అర్హులకు పథకాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే పరిస్థితి ప్రతిగ్రామంలో ఉందని, వైఎస్సార్‌సీపీ హయాంలో అవేమి లేకుండా పాలన సాగిందని ధర్మాన అన్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు చిట్టానే కనిపిస్తుందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంతకాలమూ సాగవన్నారు. బీదలకు అనుకూలంగా అనేక యాక్ట్‌లపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి వాటిని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలు చేసే అరాచకాలు, అన్యాయాలు ప్రశ్నించడమే నిజమైన ప్రతిపక్షమన్నారు. విజిలెన్స్, ఏసీబీ వంటి అవినీతి నిర్మూలన శాఖల్ని వాడుకుని అవినీతిలేని సమాజాన్ని తయారుచేసేందుకు ప్రతిపక్ష నాయుకులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉండబట్టే ప్రజల్లో అతివేగంగా బలహీనపడిందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు గొండు నర్శింగరావు, తంగి సత్యనారాయణ, అంధవరపు తవిటయ్య, పసగాడ సూర్యనారాయణ, గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మిదేవితో పాటు తాను అవినీతిరహిత పాలన అందించాం కాబట్టే ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలిగామన్నారు. ప్రజలు నాయకుల వద్ద నుంచి డబ్బులు ఆశిస్తే ప్రభుత్వ ఫలాలు సక్రమంగా తీసుకోలేరన్నారు. అధికార పార్టీ నాయకులు అధికంగా డబ్బు ఖర్చుపెట్టి గెలిచాక ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలనే తాపత్రయంతో పాలన చేస్తారే తప్ప నీతివంతంగా చేయలేరన్నారు. పేదల కోసం చంద్రబాబు ఏనాడైనా ఎకరం భూమి అయినా సేకరించి పంచిపెట్టగలిగారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలో నగరంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణం పూర్తిచేసి ఇచ్చామన్నారు. శ్రీకాకుళం నగరానికి ఇప్పటికే చాలా చేశానని, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ప్రజల ఆశీర్వాదంతో మిగిలిన పనులు పూర్తిచేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సులువుగా సాధించుకోగలమన్నారు. అందరినీ చైతన్యవంతులు చేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచి పనుల్ని అందరికి తెలియజేయాలని కోరారు. జిల్లాకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరుగుతుందని మౌనంగా ఉంటే పనులు జరగవన్నారు. సౌమ్యుడైన చల్ల శ్రీనును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించడం సంతోషమన్నారు. పార్టీకోసం మరింత కష్టపడి పనిచేసి సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం చల్ల శ్రీనివాసరావుదని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
●వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన చల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, న్యాయవాదిగా మంచి గుర్తింపు ఉందని, ఆయన ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలన్నదే తన లక్ష్యమని, తనకు అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తానన్నారు. తనకు పదవిని అప్పగించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌కు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు, కళింగ వైశ్య, పోలినాటి వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘురాం, ముంజేటి కృష్ణ, పొన్నాడ రుషి, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, మండవల్లి రవి, చిట్టి జనార్ధనరావు, టి.కామేశ్వరి, అంబటి నిర్మల, కోణార్క్ శ్రీనివాసరావు, తంగుడు నాగేశ్వరరావు, వైశ్యరాజు మోహనరావు, మూకళ్ళ తాతబాబు, యజ్జల గురుమూర్తి, డాక్టర్ ధర్మాన లక్ష్మీనారాయణ, డాక్టర్ అమ్మన్నాయుడు, చల్ల రవి, బొడ్డేపల్లి పద్మజ, గంగు శారద తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాల వర్తింపు
వైఎస్సార్ సీపీపై అక్కసుతో మంచి పథకాలను సైతం ఆపేస్తున్నారు
సాగునీటి ప్రాజెక్టులకు ఏళ్లు గడిచినా మోక్షం కలగడం లేదు
చల్ల శ్రీను సన్మాన సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు