
డీఏ ప్రకటన కంటితుడుపు చర్య
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులకు అనేక అమలు చేయలేని హామీలిచ్చిన చంద్రబాబునాయుడు 16 నెలల తరువాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం భావ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కూరు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఉద్యోగులకు ఆశ కల్పించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ముఖం చాటేయడం సిగ్గుచేటన్నారు. పీఆర్‌సీ, ఐఆర్ కాకుండా ఒక్క డీఏ ఇవ్వడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రులు సొంత పనులకోసం కోట్లాది రూపాయిలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కూటమి సర్కారుకు పెన్షనర్లు, ఉద్యోగుల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లంచుకోక తప్పదన్నారు.
శ్రీకాకుళం: రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కంటితుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ప్రకటించడం సరికాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేడాడ కృష్ణారావు, పూజారి హరిప్రసన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉద్యోగులకు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా వాటిని చెల్లించకుండా బకాయిపడిన నాలుగు డీఏలలో కేవలం డీఏ చెల్లించడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమన్నారు. మధ్యంతర భృతి ప్రకటన చేయకుండా, మూడేళ్లుగా ఉద్యోగుల సంపాదిత సెలవుల డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒకవైపు చెబుతూనే, మరోవైపు విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్‌కు సంవత్సరానికి 22 వేల కోట్ల రూపాయలు రాయితీని ప్రకటించడం దేనికి నిదర్శనమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా, ఉద్యోగ వర్గాలను నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదన్నారు.
బుక్కూరు
ఉమామహేశ్వరరావు
పేడాడ కష్ణారావు

డీఏ ప్రకటన కంటితుడుపు చర్య