
బస్సు ఆపలేదని నిరసన
పోలాకి : బస్సు ఆపడం లేదంటూ బెలమర జంక్షన్ సమీపంలో జీడిపప్పు ఫ్యాక్టరీ వద్ద మహిళలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 సమయంలో గుప్పెడుపేట–నరసన్నపేట ఆర్టీసీ బస్సు ఫ్యాక్టరీ వద్ద ఆగడంతో మహిళా కార్మికులు ఎక్కేవారు. ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపడంలేదు. ఇదేంటని మహిళలు ప్రశ్నిస్తే అక్కడ స్టాప్‌లేదని, ముందున్న స్టాప్ దగ్గరకు రావాలని దురుసుగా సమాధానం చెప్పడంతో మహిళలు ఆగ్రహించి బస్సును రోడ్డుమీదే ఆపేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంజిత్ డ్రైవర్, మహిళలతో మాట్లాడారు. రిక్వెస్ట్ స్టాప్‌గా పరిగణించాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. దాదాపు 20 మంది మహిళలు నిత్యం బస్సుకోసం వేచి ఉన్నచోట కాదని, ఇంకోచోట స్టాప్ ఉందని తప్పించుకుంటే ఊరుకునేది లేదని మహిళలు స్పష్టం చేశారు. టికెట్ తీసుకున్నపుడు ఉన్న స్టాప్, ఉచితం అన్నప్పుడు ఎందుకుండదని నిలదీయటం గమనార్హం.
వృద్ధుడు ఆత్మహత్య
రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన గురజాపు అప్పలనాయుడు (69) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు ఈ నెల 10న సాయంత్రం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. భార్య మందలించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు హెచ్‌సీ ఎం.విజయానంద్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.