
ఘనంగా ఇంజినీర్ల దినోత్సవం
అరసవల్లి: స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయం వద్ద పీఆర్ ఇంజినీర్ల సంఘం ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకొని ఇంజినీర్ల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సుమారు 50 మంది ఇంజినీర్లు, సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.జగన్మోహనరావు, పీఆర్ డిప్లమో ఇంజినీర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి, పీఆర్ ఎస్‌ఈ కె.వీరన్నాయుడు, ఈఈలు ఎస్.రామకృష్ణ, జి.ప్రదీప్‌కుమార్, జి.రవి, జిల్లా డిప్లమో ఇంజినీర్ల సంఘ ప్రతినిధులు ఎం.పోలినాయుడు, ఎస్.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.