వలస వెళ్లిన మనిషి తిరిగి రాలేదు | - | Sakshi
Sakshi News home page

వలస వెళ్లిన మనిషి తిరిగి రాలేదు

Sep 16 2025 8:32 AM | Updated on Sep 16 2025 8:32 AM

వలస వెళ్లిన మనిషి తిరిగి రాలేదు

వలస వెళ్లిన మనిషి తిరిగి రాలేదు

ఎస్పీ గ్రీవెన్స్‌

ఫోకస్‌

● ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌లో విన్నవించిన మహిళ

● నాలుగేళ్లుగా భర్త జాడ తెలియడం లేదని ఆవేదన

● గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 55 ఫిర్యాదులు

శ్రీకాకుళం క్రైమ్‌ : ప్రతి సోమవారం నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు ఈ వారం ఓ అరుదైన వినతి వచ్చింది. నాలుగేళ్లుగా భర్త జాడ తెలియక నరకయాతన పడుతున్న మహిళ తన పెనిమిటి జాడ కనుక్కుని చెప్పాలని ఎస్పీని వేడుకున్నారు. వలస వెళ్లిన మనిషి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడుకు చెందిన పుచ్చ అనసూయమ్మ సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు హాజరయ్యారు. తన భర్త పుచ్చ కూర్మారావు జాడ నాలుగేళ్లుగా తెలియరావడం లేదని ఆమె ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ముందు మొర పెట్టుకున్నారు. 2014 నుంచి సౌదీఅరేబియాకు తన భర్త వలస వెళ్లే వారని, చివరి సారిగా 2021లో కింగ్‌డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియాలోని దమ్మంలో ఏఎల్‌–మాష్రిక్‌ ట్రేడింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌ కంపెనీకి వెళ్లారని, అప్పటి నుంచి ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎంబసీలో కూడా దీనిపై ఫిర్యాదు చేశామన్నారు. పలుమార్లు వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు తిరుగుతున్నా పట్టించుకోలేదని, మీరైనా జాడ కనుగొని చెప్పాలని ఎస్పీ వద్ద బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

● ఈ వారం గ్రీవెన్స్‌కు 55 ఫిర్యాదులు అందాయి.

● పొందూరు మండలం వీఆర్‌ గూడేనికి చెందిన సువ్వారి సన్యాసమ్మ తన ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

● తనపై జరిగిన దాడి కేసులో సాక్షులుగా ఉన్న వారిని బెదిరిస్తున్నారని శ్రీముఖలింగానికి చెందిన పూజారి నాయుడు గారి రాజశేఖర్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా బైండోవర్‌ చేయడం లేదని తెలిపారు.

● ఓ ఫైనాన్స్‌ వ్యాపారి తన చెక్కును దుర్వినియోగం చేసి తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 45 వేలు కాజేశాడని, న్యాయం చేయాలంటూ శ్రీకాకుళంలోని బలగకు చెందిన కె.రామారావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

● శ్రీకాకుళం సబ్‌డివిజన్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్‌ యువకుడు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో రూ. 15 లక్షలు నష్టపోయానని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement