
కొండకు గుండు
● కొండకుంకాంలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు
● రెండు రోజులుగా ఇదే తంతు
రణస్థలం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు చేస్తున్న అడ్డగోలు గ్రావెల్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. లావేరు మండలంలోని కొండకుంకాం గ్రామంలో సర్వే నంబర్ 1లో 374 ఎకరాల గ్రావెల్ కొండ ఉంది. ఇందులో కొంతమందికి డీ–పట్టాలు మంజూరు చేసి ఉన్నారు. అధికారంలోకి రాగానే ఈ కొండపై కూట మి నాయకుల కన్ను పడింది. ఆదివారం రాత్రి నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీతో కొండ గ్రావెల్‌ను కొల్లగొడుతూనే ఉన్నారు. సోమవారం స్థానికులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి చూసే సరికి.. సగం కొండను మాయం చేసేశారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వాళ్లు అక్కడి దృశ్యాలు చూసి విస్మయం చెందారు.
గ్రామ రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానం
కొండకుంకాం రెవెన్యూ పరిధికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ ఇద్దరూ ఒకే రోజు సెలవు పెట్టడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గ్రావెల్ తరలిస్తున్నా పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యా హ్నం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పైడి హారతి, ఇతర రెవెన్యూ అధికారులు కొండను సందర్శించి వివరాలు సేకరించారు.

కొండకు గుండు