
గంజాయితో నవ దంపతులు అరెస్టు
పలాస: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న బీహార్‌కు చెందిన నవ దంపతులు జూలీ ప్రవీణ్, సాజిత్ అన్సారీలను కాశీబుగ్గ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పలాస జి.ఆర్.పి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.రవికుమార్ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం గాంధీనగర్‌కు చెందిన సాజిత్ అన్సారీ, బోజ్‌పూర్ జిల్లాకు చెందిన జూలీ ప్రవీణ్‌లకు ఇటీవలే వివాహం జరిగింది. పశ్చిమబెంగాల్‌కు గంజాయి రవాణా చేస్తే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని మధ్యవర్తులు ఆశ చూపడంతో అక్రమ రవాణాకు అంగీకరించారు. ఈ క్రమంలో పలాస రైల్వే స్టేషన్‌కు వచ్చిన వీరిని అనుమానించిన ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం.మాల్యాద్రి బ్యాగులను పరిశీలించారు. అందులో 40 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జి.ఆర్.పి స్టేషన్ ఇన్‌చార్జి ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేశారు. నిందితులను విశాఖ జైలుకు తరలించినట్టు రవికుమార్ చెప్పారు.