
యూరియా.. ఇంత నిర్లక్ష్యం ఎందుకయ్యా..?
● వానకు తడిచిపోతున్న యూరియా బస్తాలు
● ఆమదాలవలస రైల్వే గూడ్స్‌షెడ్ వ్యాగన్ నుంచి వర్షంలోనే లారీలకు లోడ్‌చేస్తున్న దృశ్యం
● అపరాధ రుసుం భయంతో ప్లాట్‌ఫాంపైనే నిల్వలు
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని వ్యవసాయ శాఖ అధికారులు
ప్లాట్‌పాంపై వర్షంలో తడుస్తున్న యూరియా నిల్వలు
ఆమదాలవలస రూరల్:
అసలే యూరియా కొరతతో జిల్లా సతమతమవుతూ ఉంటే వచ్చిన సరుకును కూడా సరిగా సంరక్షించకుండా అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్‌కు యూరియా నిల్వలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఎన్‌డీఆర్ సంస్థకు సంబంధించి గురువారం సాయంత్రం ఓ వ్యాగన్ రాగా.. మరో వ్యాగన్ శుక్రవారం ఉదయం వచ్చింది. కానీ శుక్రవారం ఉదయం ఎడ తెరిపి లేని వాన కురవడంతో యూరియా తడిచి ముద్దయ్యింది. వాస్తవంగా రైల్వేగూడ్‌షెడ్ వ్యాగన్ నుంచి వచ్చిన సరుకులను ఆ వ్యాగన్ పరిమాణాన్ని బట్టి 5–8 గంటల్లోపు ఖాళీ చేయాలి. లేదంటే రైల్వే శాఖకు అపరాధ రుసుం కట్టాలి. అపరాధ రుసుం భయంతో కంపెనీ యజమానులు యూరియాను వర్షంలోనే అన్‌లోడ్ చేశారు. దీంతో యూరియా తడిచిపోయింది.
వ్యవసాయాధికారుల ఆచూకీ కరువు
అసలే రైతులు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతుంటే.. వ్యవసాయ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎరువులు ప్రభుత్వానివైనా, ప్రైవేటువైనా వ్యవసాయ శాఖాధికారులు వ్యాగన్ వద్దకు వచ్చి పరిశీలించాలి. వర్షం వచ్చిన సమయంలో వ్యాగన్ నుంచి యూరియా దించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. ఒక వేళ అన్‌లోడ్ చేసినా కనీసం టార్పాలిన్లు అయినా కప్పాలి. కానీ శుక్రవారం లోడ్ రాగా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వర్షానికి తడిచిన యూరియా పటుత్వం కోల్పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

యూరియా.. ఇంత నిర్లక్ష్యం ఎందుకయ్యా..?