చిక్కుముడి! | - | Sakshi
Sakshi News home page

చిక్కుముడి!

Sep 10 2025 10:04 AM | Updated on Sep 10 2025 10:04 AM

చిక్క

చిక్కుముడి!

బాల్యానికి.. చిక్కుముడి! ● జిల్లాలో ఆగని బాల్య వివాహాలు ● రాష్ట్రంలో మూడో స్థానం ● చదువుకు దూరమవుతున్న బాలికలు ● జీవితాంతం వెంటాడుతున్న రుగ్మతలు చట్టరీత్యా నేరం..

బాల్యానికి..
● జిల్లాలో ఆగని బాల్య వివాహాలు ● రాష్ట్రంలో మూడో స్థానం ● చదువుకు దూరమవుతున్న బాలికలు ● జీవితాంతం వెంటాడుతున్న రుగ్మతలు

హిరమండలం: బడిబాట పట్టాల్సిన బాలికలు పెళ్లిపీటలెక్కుతున్నారు. తెలిసీ తెలియని వయసులో వారిని మూడుముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. చదువు, ఆటపాటలతో హాయిగా గడవాల్సిన సమయంలో గర్భం దాల్చుతున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు, కట్టుబాట్లతో పెద్దలే చిన్నారులకు పెళ్లిచేసి అత్తారింటికి పంపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వలసలు వెళ్లే పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లాలో 11 తీర ప్రాంతాల్లో సైతం బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు అనేవి ఒక సంప్రదాయంగా వస్తున్నాయి. అక్కడ కులం కట్టుబాట్లతో ఎక్కవగా చిన్ననాటే పెళ్లిళ్లు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో చాలావరకూ బాల్య వివాహాలు అదుపులోకి వచ్చాయి. అవగాహన ఉన్నవారు తమ పిల్లల విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ, నిరక్షరాస్యులు మాత్రం ఆడపిల్లలను భారంగా పరిగణించి బాల్య వివాహాలు చేసేస్తున్నారు. సమాచారం అందుకుంటున్న అధికారులు 2020–21లో 114, 2021–22లో 68, 2022–23లో 144, 2023–24లో 96, 2024–25లో 28 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2025–26కు సంబంధించి 18 బాల్య వివాహాలను అడ్డుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఆర్థిక భారంతో..

శ్రీకాకుళం ప్రధానంగా వలసల జిల్లా. చాలా గ్రామాల్లో భార్య, భర్త ఇద్దరూ పనికి వెళితే గానీ పూటగడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో పదో తరగతి వరకూ ఆడపిల్లలను చదివించి వెంటనే వివాహాలు జరిపించేస్తున్నారు. ఇలా చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకుంటున్నారే తప్ప.. బాల్య వివాహాలతో తమ పిల్లలను అనారోగ్య కూపంలోకి తోసివేస్తున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు.

ఆ జాబితాలో జిల్లా..

రాష్ట్రంలో 45 శాతానికి మించి బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం మూడోస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో 23 శాతం మంది 15 నుంచి 18 సంవత్సరాల్లోపు బాలికలే అమ్మలుగా మారుతున్నారు. బాల్యంలో తల్లులు కావడం అనేది గతంతో పోల్చుకుంటే తగ్గినప్పటికీ.. బాల్య వివాహాలు మాత్రం ఆగకపోడం ఆందోళన కలిగిస్తోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. 15 నుంచి 19 ఏల్ల వయసులోపు బాలికలు నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉంటారు. తల్లిగా మారే సమయంలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ తగ్గడంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో చనిపోవడం, వైకల్యంతో పుట్టడం, ఆరోగ్యకరమైన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఫిర్యాదు చేయవచ్చు..

బాల్య వివాహాలు జరిగితే నిర్భయంగా 1098, 100, 181 వంటి టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం సమాచారం అందించవచ్చు. జిల్లా అధికారులు రంగంలోకి దిగి స్థానిక పోలీసుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహాల నియంత్రణకు ‘బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌’ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా కూడా బాల్య వివాహాల సమాచారం చేరవేయవచ్చు. అయితే, ఇటీవల ఫేక్‌ ఫిర్యాదులు చేస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంతమంది తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. నిజంగా బాల్య వివాహం జరుపుతుంటే మాత్రం నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వచ్చి తప్పకుండా అడ్డుకుంటారు.

బాల్య వివాహాలు చట్టపరంగా నేరం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే ఫిర్యాదు చేయాలి. ఎటువంటి భయం అవసరం లేదు. స్థానిక పోలీసుల రక్షణలోనే విచారణ జరుగుతుంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. వారి సమ్మతితోనే వివాహాన్ని నిలుపుదల చేయిస్తాం. బాల్య వివాహాలతో అనారోగ్యం తప్పదు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. దీనిపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం

– ఐ.విమల, ఐసీడీఎస్‌ పీడీ, శ్రీకాకుళం

ఎల్‌ఎన్‌పేట మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిశ్చయించారు. సన్నాహాలు కూడా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహం జరిపితే కలిగే అనర్థాలను వివరించారు. దీంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

హిరమండలానికి ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి చదువుతున్న కుమార్తెకు వివాహం జరపాలని నిర్ణయించారు. బాలికకు పెళ్లి ఇష్టం లేదు. దీంతో స్నేహితుల ద్వారా చైల్డ్‌లైన్‌ అధికారులను ఆశ్రయించింది. వారు వచ్చి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

చిక్కుముడి!1
1/1

చిక్కుముడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement