
అత్యాశతోనే అంతం చేశారు
పక్కా పథకం ప్రకారమే బంగారం వ్యాపారి గుప్తా హత్య
ఇద్దరు నిందితుల అరెస్టు
ఆర్‌ఎస్ జ్యూయలరీ యజమానిపై కేసు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ
నరసన్నపేట : అత్యాశకు పోయి సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తాను మోలి అప్పలరాజు, జువ్వాది సంతోష్‌లు హత్య చేశారని టెక్కలి డీఎస్‌పీ డి. లక్ష్మణరావు తెలిపారు. గుప్తా వద్ద కాజేసిన కేజీ 33 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని చెప్పారు. అప్పలరాజులు, జువ్వాది సంతోష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. నిందితుల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన ఆర్‌ఎస్ జ్యూయలరీ యజమానిని ఈ కేసులో మరో ముద్దాయిగా గుర్తించామని, ఈయన్ను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కేసు వివరాలను నరసన్నపేటలో మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
గెడ్డలో మృతదేహం లభ్యం..
బంగారం వ్యాపారం చేస్తున్న గుప్తా ఆగస్టు 26న తన బొలెరో వాహనంలో డ్రైవర్ సంతోష్‌తో పాటు విశాఖ వెళ్లారు. నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో గుప్తా సోదరుడు మన్మధరావు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. వారం తర్వాత గుప్తా మృతదేహం శ్రీకాకుళం సమీపంలోని రామిగెడ్డ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. శరీరంపై గాయాలు బట్టి హత్య కేసుగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సంతోష్‌పై అనుమానంతో నిఘా పెట్టి విచారణ చేయగా బంగారం కోసమే గుప్తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. పెద్దపాడు వద్ద ఆదిత్య కార్ వరల్డ్ బిల్డింగ్ యజమాని మోలి అప్పలరాజు షాపులో గుప్తా మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు. ఆ సమయంలో వర్షాలు అధికంగా పడటంతో మృతదేహం కొట్టుకుపోతుందని భావించారు. ఇంతలో తుప్పలు అడ్డుపడటంతో మృతదేహాన్ని గుప్తా బంధువులు గుర్తించగలిగారు. డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే అప్పలరాజు ఈ హత్యలో పాలుపంచుకుని బంగారంలో అధిక భాగం తీసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పలరాజేనని డీఎస్పీ తెలిపారు. సంతోష్ భార్య ప్రశాంతి, బొరిగివలసకు చెందిన మణిలు కేసులో నిందితులు కాదని వివరించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి ఎస్‌ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, అశోక్‌బాబు, అనిల్, రంజిత్‌లు చాకచక్యంగా కేసును దర్యాప్తు చేసి సకాలంలో బంగారాన్ని రికవరీ చేశారని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

అత్యాశతోనే అంతం చేశారు