
కదం తొక్కిన జీడి కార్మికులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం మందస జీడి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు, జీడి కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీడి కార్మికులకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించాలని, కాల్చిన పిక్కలు అక్రమ తరలింపు ఆపాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందస జీడి యాజమాన్యాలు కాల్చిన పిక్కలను పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు ఇవ్వకుండా అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలిస్తుంటే ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్మికులకు పని కల్పించకుండా, లైసెన్సులు లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమ పద్ధతిలో తరలించడం సరికాదన్నారు. కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని, కనీస వేతనాలు గానీ, పీఎఫ్, ఈఎస్‌ఐ, అదనపు పనికి అదనపు వేతనం వంటివి అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల పోరాటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, రైస్ మిల్లు కార్మిక సంఘం నాయకులు కె.కేశవరావు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జిల్లా జీడి కార్మిక సంఘం నాయకులు అల్లు హేమలత, సీహెచ్ చంద్రమ్మ, సీహెచ్ జానకమ్మ, కె.శేషమ్మ, పి.సావిత్రి, జి.బాలమ్మ, కె.కుమారి, కె.శాంతమ్మ, కె.సరస్వతి, బి.భారతి, కె.ధనం, డి.లక్ష్మి, ఎం.దానమ్మ, డి.భారతమ్మ పాల్గొన్నారు.