
హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ఆమదాలవలస: కొత్తవలస గ్రామానికి చెందిన అరసవెల్లి హరమ్మ హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆమదాలవలస పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో హరమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 4వ తేదీన మృతిచెందిందన్నారు. ఈ ఘటనలో కొత్తవలస గ్రామానికి చెందిన దవల లక్ష్మణరావుతోపాటు మరో నలుగురు వ్యక్తులు, ఒక మైనర్‌పై హత్య కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితులు పోలీసులకు దొరక్కుండా పరారయ్యారన్నారు. తదుపరి దర్యాప్తులో ఎస్సై ఎస్.బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల కదలికలపై సమాచారం సేకరించి మంగళవారం కొర్లకోట సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను జూనియర్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మైనర్ నిందితుడిని జువైనెల్ కోర్టు ఎదుట హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.