
సకాలంలో వినతులు పరిష్కరించాలి
ఇరిగేషన్ లిఫ్టుకు మరమ్మతులు చేయాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
● పీజీఆర్‌ఎస్‌కు 75 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సకాలంలో అధికారులు పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ శాఖలకు చెందిన 75 వినతులు స్వీకరించారు. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 23 దరఖాస్తులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 16, మున్సిపల్ శాఖకు 5, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెరో 4 దరఖాస్తులు అందాయి. అదేవిధంగా నీటి వనరులు, సర్వే సెటిల్‌మెంట్స్, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెరో 3 ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, డిప్యూటీ కలెక్టర్ (డీఎంపీసీ) టి.వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
వినతులు పరిశీలిస్తే...
ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్, డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.30,000ల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఆటో డ్రైవర్లు వినతిపత్రం అందజేశారు. ఫ్రీ బస్సు పథకం వలన తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు.
● సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు గ్రామ పంచాయతీ బొంతుగూడ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరారు.
● ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్‌లు, మౌఖాన్‌ల గౌరవ వేతనాలు చెల్లించాలని జిల్లా మైనారిటీ సెల్ కమిటీ ప్రతినిధులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం తగదన్నారు.
● తనకు వారసత్వంగా అనుభవ స్వాధీనంలో ఉన్న ఆస్తిని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేశారని శ్రీకాకుళం మండలం కనుగులవానిపేటకు చెందిన టీడీపీ నాయకుడు ఇప్పిలి వెంకట శివలక్ష్మీ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం మండలం కనుగులవానిపేట రెవెన్యూలోని సర్వే నంబర్ 208/2లో 5.50 ఎకరాలు షెడ్యూల్ ఆస్తికి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, భూ హక్కులు కలిగి ఉన్న ఇప్పిలి వరలక్ష్మి మరణానంతరం, కనుగుల సత్యారావు దౌర్జన్యంగా ఆక్రమించుకొని, హక్కుదారులపై కేసులు బనాయిస్తున్నాడని వాపోయారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఫిర్యాదు చేసిన ఇప్పిలి వెంకట శివలక్ష్మీ ప్రసాద్, ఆక్రమణలకు పాల్పడినవారు టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం.
బూర్జ మండలంలోని నీలాదేవిపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లు పాడైపోయి 5 గ్రామ పంచాయతీల పరిధిలోని 800 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ విషయంపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే ఆమదాలవలస మండలం పొన్నంపేట గ్రామంలో ఇదివరకే ఒక శ్మశానవాటిక ఉంటుండగా, రాజకీయ కారణాలతో రెండో శ్మశానవాటిక ఏర్పాటు చేయడానికి అధికారుల సన్నాహాలు నిలుపుదల చేయాలన్నారు. పొందూరు మండలంలోని చాలా గ్రామాల్లో రైతులకు ఎరువులు అందలేదని, సక్రమంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆయనతో పాటు పలువురు రైతులు ఉన్నారు.