
23 నుంచి కొత్తమ్మ తల్లి జాతర
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఈ సారి కూడా సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సమక్షంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని, శోభా యాత్ర, గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫైర్ వర్క్స్, హెలికాప్టర్ రైడింగ్ సవ్యంగా నిర్వహించాలన్నారు. చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు అందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమానికి టెక్కలి ఆర్డీవోను ఇన్‌చార్జిగా నియమించామని, ట్రాఫి క్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ బాధ్యతలు టెక్కలి ఎస్‌డీపీఓకు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో రోగుల అవస్థలు
టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. అయితే వారు కూర్చునేందుకు సైతం సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కిందే కూర్చుని నిరీక్షించాల్సి వస్తోంది.
ఆలయాల్లో గ్రహణ శుద్ధి
అరసవల్లి: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం జిల్లాలో అన్ని ప్రధాన ఆలయాల తలుపులు తెరచుకున్నాయి. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతో పాటు అన్ని ఆలయాల్లో గ్రహణానంతర శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ శాస్త్ర ప్రకా రం అక్కడి అర్చకులు జరిపించారు. అరసవల్లిలో సోమవారం వేకువజామున గ్రహణ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించి విశేష పూజలు చేశారు. తర్వాత ఉదయం 7.30 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచి భక్తులకు సర్వ దర్శనాలకు అనుమతించారు.
ముఖలింగంలో..
జలుమూరు: సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం సోమవారం శ్రీముఖలింగం ఆలయంలో అర్చకులు శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఆలయంలోని విగ్రహాలకు గంగ, వంశధార జలాలలతో అభిషేకం చేశారు.
శ్రీకూర్మంలో..
గార: శ్రీకూర్మనాథాలయంలో సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉషోదయం పూజలనంతరం భక్తులకు దర్శనం అవకాశం కల్పించారు.

23 నుంచి కొత్తమ్మ తల్లి జాతర