
అర్జీలు పునరావృతం కాకూడదు
● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం: బాధితుల నుంచి స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వారి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరితమైన, ఆస్తి తగదాలు, కొట్లాట, ఇతరత్రా సమస్యలపై 52 ప్రజా ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు.