
విద్యారంగ సమస్యలపై రణభేరి
శ్రీకాకుళం: పాఠశాల విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలపై సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు జరిగే యూటీఎఫ్ రణభేరి జాతా విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని చెప్పారు. మూడు నెలలుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు లేవన్నారు. మూడో వంతు ప్రైమరీ పాఠశాలలు సింగిల్ టీచర్లు స్కూల్‌గా మారిపోయాయని, సగంపైన హై స్కూల్స్ సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా తయారయ్యాయని, హైస్కూల్లో పనిచేయాల్సిన స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్స్ పేరుతో క్లస్టర్ టీచర్లుగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్‌గా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించడం తగదన్నారు. పీఆర్ కమిషన్ వెంటనే నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు కె.దాలయ్య, బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శులు పి.సూర్యప్రకాషరావు, టి.వి.టి.భాస్కరరావు, బి.శంకరరావు, ఎం.వి.రమణ, జి.శారద, ఎస్.స్వర్ణకుమారి, బి.గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.