
ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలు
మందస,పలాస: మందస మండలం నారాయణపు రం గ్రామంలో ఎలుగుబంటి మరోసారి శనివారం దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. శుక్రవారం నారాయణపురం గ్రామంలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఒక వ్యక్తి ఎలుగు దాడిలో గాయాలపాలయ్యాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే శనివారం సాయంత్రం కూడా గొరకల పాపారావు, పందిరి గున్నయ్య, లక్ష్మీనారాయణ, మోహనరావులపై దాడి చేసి గాయపర్చింది. దీంతో గ్రామస్తులు ఎలుగును హతమార్చారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణనాయుడు సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. కాశీబుగ్గ నుంచి ముగ్గురు వైద్యులు వచ్చి క్షతగాత్రులను పరిశీలించారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. పోస్టు మార్టం చేసి తర్వాత ఎలుగుబంటి మృతదేహాన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఎలుగుదాడికి గురైన నలుగురు వ్యక్తులు హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.