
గూగుల్ అంబాసిడర్‌గా బీఆర్‌ఏయూ ఈసీఈ విద్యార్థి
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల కేటగిరీ నుంచి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు స్టూడెంట్ అంబాసిడర్ (జీఎస్‌ఏ)గా ఎంపికయ్యారు. ఏఐ ద్వారా జెమినీ ఏఐ, గూగుల్ టెక్నాలజీపై స్వల్ప కాలిక అవగాహన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సాయిప్రదీప్‌కు అవకాశం లభిస్తుంది. అలాగే సాంకేతిక సంబంధిత పోటీల నిర్వహణ, దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్ ఇన్నోవేటర్స్‌కు సంస్థను అనుసంధానం చేయడం, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడంపై కూడా దృష్టి సారించవచ్చు. విద్యార్థి ఎంపికపై వర్సిటీ వీసీ ఆర్‌కే రజినీ, రిజిస్ట్రార్ పి.సుజాత ప్రత్యేకంగా అభినందించారు. గూగుల్ అంబాసిడర్ కిట్‌ను ఈ సందర్భంగా సాయిప్రదీప్‌కు అందజేశారు.