
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆమదాలవలస: మెట్టక్కివలసలోని కుప్పిలివారివీధికి చెందిన బరాటం తాతయ్యలు(51) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవా రం ఆమదాలవలస ఎస్‌ఐ ఎస్.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాతయ్యలు మూడు రోజులుగా ఇంటికి రాకపోవడంతో భార్య సత్యవతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో శుక్రవారం పట్టణంలోని లక్ష్మీనగర్ వీధి శివారులోని శ్మశాన వాటిక షెడ్డులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పరిశీలించగా తన భర్తేనని సత్యవతి నిర్ధారించింది. పోలీసులు అనుమానాస్పదకేసుగా దర్యాప్తు కొనసాగిస్తూ మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి శవపంచనామాకు తరలించారు.
దుబాయ్‌లో చినవంక వాసి అదృశ్యం
వజ్రపుకొత్తూరు రూరల్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తన భర్త సాన రాజేష్ ఆచూకీ తెలియడం లేదని చినవంక గ్రామానికి చెందిన ఢిల్లెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ 2015లో దుబాయ్ వెళ్లిన తన భర్త 2019 తర్వాత ఆచూకీ లేకుండా పోయారని, పదేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోయింది. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నానని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి భర్త ఆచూకీ తెలియజేయాలని ఢిల్లెమ్మ వేడుకుంది.
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న తంగుడు నాగమణి(40) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు టి.వెంకటరావు, కె.కుమారి, బరాటం మల్లేశ్వరరావులు కొల్లు సత్యనారాయణ ద్వారా రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియచేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్‌చార్జి సుజాత, నంది ఉమాశంకర్ ద్వారా నాగమణి కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు తెలియజేయాలని కోరారు.