
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య
ఆమదాలవలస: చిట్టివలస గ్రామానికి చెందిన నవిరి పూర్ణ (22) అనే వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమదాలవలస ఎస్‌ఐ ఎస్.బాలరాజు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస పట్టణంలోని ఐజేనాయుడు కాలనీకి చెందిన సాయిపల్లి మధుసూదనరావుతో పూర్ణకు నాలుగు నెలలు క్రితం వివాహం జరిగింది. కట్నం కింద రూ.5 లక్షలు, 8 తులాల బంగారం ఇచ్చారు. అయినప్పటికీ భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవారు. ఈ బాధలు భరించలేక పూర్ణ తన తల్లిదండ్రులు నవిరి సింహాచలం, పద్మలకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. అనంతరం భర్త, అత్తమామలను పిలిపించి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అదనపు కట్నం కోరడం తగదని చెప్పగా తాము ఇంకేమీ అడగబోమని భర్త, అత్తమామలు ఒప్పుకున్నారు. దీంతో పూర్ణ అత్తవారి ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ రెండురోజుల భర్త కొట్టడంతో పూర్ణ కన్నవారింటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలిసి ఆగస్టు 17న భర్త వేధింపులపై ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక సెప్టెంబర్ 2న పూర్ణ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం పూర్ణ మృతి చెందింది. బాధితురాలి తండ్రి సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్ల వేధింపులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. పూర్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.