
గంజాయి రవాణా గుట్టురట్టు
పలాస: గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ చెప్పారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా నియోగుడ గ్రామానికి చెందిన అరబింద ఆనంద్, తబరద గ్రామానికి చెందిన మైకీల్ రైతా, సెరంగో గ్రామానికి చెందిన ప్రాతిమా లిమ్మాలను పర్లాకిమిడి మీదుగా పలాస రైల్వే స్టేషన్‌కు బుధవారం రాగా పలాస రైల్వే స్టేషన్ కూడలి వద్ద పట్టుకుని విచారించారు. వారి వద్ద 16.435 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైక్, రెండు సెల్‌ఫోన్లు, రూ.1580 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బైక్‌పై తరలిస్తుండగా..
ఇచ్ఛాపురం రూరల్: ఒడిశా నుంచి ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం పట్టణ సర్కిల్ కార్యాలయంలో కవిటి ఎస్‌ఐ వి.రవివర్మతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కొడల గ్రామానికి చెందిన సాగర్ బెహరా, అతని స్నేహితుడు పీతల గ్రామానికి చెందిన బాలుడు రాజేష్ జెన్నాతో కలిసి గురువారం ఒడిశా నుంచి స్థానిక 16వ నెంబర్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై 21.030 కేజీల గంజాయిని తరలిస్తుండగా కవిటి పోలీసులు కొజ్జిరియా ఫ్‌లై ఓవర్ బ్రిడ్జిపై పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనపరచుకున్నామన్నారు. పలాస చేరుకొని అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో స్పిన్నింగ్ మిల్లులో కూలీగా పనిచేస్తున్న దేవేంద్ర పండికి ఇచ్చేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులకు ఆశపడి గంజాయి వ్యాపారీ సమీర్ సాహూ వద్ద నుంచి గంజాయిని తరలిచేందుకు అంగీకరించినట్లు నిందితులు తెలిపారు.