
చేతబడి నెపంతో వృద్ధుడి హత్య
పలాస: కేశుపురం గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ రాములు(80) దారుణ హత్యకు గురయ్యాడు. చేతబడి(చిల్లంగి) చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం రాత్రి రాళ్లతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశుపురం గ్రామానికి చెందిన అంబలి తులసీరావు పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బోరుబద్ర గ్రామానికి చెందిన ఓ బూత వైద్యుడిని ఇంటికి పిలుపించుకొని పూజలు చేయించారు. అతను వెళ్లిపోయిన తర్వాత అదేరోజు రాత్రి తులసీరావు కుటుంబ సభ్యులు, బంధువులు ఉంగ రాములు ఇంటికి వెళ్లారు. రాములను బయటకు ఈడ్చుకొచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో రాము తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు, సీఐ పి.సూర్యనారాయణ బుధవారం గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులను కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సీఐ చెప్పారు.