
సాదాసీదాగా సలహా కమిటీ సమావేశం
టెక్కలి: టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో బుధవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఏడాది తర్వాత నిర్వహించిన సమావేశంలో భాగంగా ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలతో పాటు ఇతర సమస్యలపై కనీస ప్రస్తావన లేకుండా హడావుడిగా కొన్ని మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి సమావేశాన్ని ముగించేశారు. ముందుగా కలెక్టర్ ఆస్పత్రిలో బాలల సత్వర కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా ప్రాంగణంలో చిన్నారులకు సౌకర్యవంతంగా ర్యాంపులు నిర్మాణం చేయాలని, సుగంధ మొక్కలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఓపీ విభాగం, రక్తనిధి కేంద్రం, వివిధ ల్యాబ్‌లు, డాక్టర్ల విభాగాలతో పాటు మరికొన్ని విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని, దీనికి అవసరమైన సదుపాయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయితే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలతో పాటు మురుగు వ్యవస్థ ఇతర సమస్యలపై ప్రస్తావన లేకుండా, కొన్ని రకాల అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనపై నిధులు మంజూరు కోసం వివరాలు సేకరించారు. అంతకుముందు ఆస్పత్రిలో సుమారు రూ.40 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పనులను కలెక్టర్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆస్పత్రి గేటు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో నిధుల అంచనాపై కలెక్టర్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఆయనతో పాటు సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, డీఎంఅండ్‌హెచ్‌వో కె.అనిత, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీసీహెచ్‌ఎస్ కల్యాణ్‌బాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావు, వైద్యులు లక్ష్మణరావు, మహారాజ్, రాజశేఖర్, వినోద్, జ్ఞానప్రసూణ తదితరులు పాల్గొన్నారు.