
ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతకు అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డున పారేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కూటమి పాలకులు రైతులకివ్వాల్సిన ఎరువులను ప్రైవేట్ డీలర్లకు అమ్మేసి, వారిచేత కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకోవడం సరికాదన్నారు. కౌలు రైతులను ఆదుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. మరోవైపు వికలాంగుల పింఛన్లను తొలగించే చర్యలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను విడనాడాలని సూచించారు.
రైతులపై భారం సరికాదు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ మాట్లాడుతూ రైతులను దగా చేసే ప్రభుత్వాలేవీ ఇప్పటివరకు మనుగడలో లేవని గుర్తు చేశారు. ఉచిత పంటల బీమా ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఇవ్వకుండా ఆ భారం రైతులపై వేయడం సరికాదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడిన విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి కార్యకర్తలు ఇసుక, గ్రావెల్, ఉద్యోగాలు అమ్ముకోవడంతో పాటు చివరికి ఎరువులను సైతం వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, నాయకుడు లోకనాథం పాల్గొన్నారు.