
ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం
నరసన్నపేట: స్థానిక లక్ష్మున్నపేటకు చెందిన వ్యాపారి వెంకట పార్వతీశం గుప్త ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు నరసన్నపేట సీఐ ఆఫీస్‌లో మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచీ డీఎస్పీ నరసన్నపేటలోనే ఉన్నారు. వినాయక చవితి ముందు రోజు ఈనెల 26వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన గుప్త ఇంతవరకూ ఇంటికి రాలేదు. దీంతో నరసన్నపేట పోలీసులకు గుప్త సోదరుడు మన్మథరావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో కేసు నమోదు చేయడంలో స్థానిక పోలీసులు జాప్యం చేశారు. ఆ తర్వాత మాత్రం కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి ఎస్‌ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, రంజిత్‌లతో పాటు సిబ్బంది దర్యాప్తులో భాగస్వాములయ్యారు.
సీసీ ఫుటేజీ పరిశీలన
జాతీయ రహదారిపై, టోల్‌గేట్లు వద్దనున్న సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అదేరోజు సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మడపాం టోల్‌గేట్ వద్దకు వచ్చేసరికి కారులో డ్రైవర్ తప్ప గుప్త లేరని సమాచారం. ఈ మేరకు మడపాం టోల్‌గేట్ సీసీ ఫుటేజీతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గుప్తను నరసన్నపేటలో దించానని డ్రైవర్ చెప్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో డ్రైవర్‌ను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బంగారు ఆభరణాలు తీసుకురావడానికి కారులో విశాఖ వెళ్లిన గుప్త, కేజీకి పైగా బంగారు ఆభరణాలు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారని తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో గుప్త ఏమయ్యారో.. బంగారు ఆభరణాలు ఏమయ్యాయి అనేది తెలియడం లేదు. మరో పక్క కుటుంబ సభ్యులు మన్మథరావుతో పాటు కొందరు వ్యాపారులను బుధవారం విచారించారు. దర్యాప్తు కొనసాగుతుందని కొన్ని చిక్కుముడులు వీడాలని పోలీసులు అంటున్నారు. గుప్త ప్రాణాలతో ఉన్నాడా.. లేదా అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గుప్తతో ఎవరికీ ఎటువంటి గొడవలు లేవని సోదరుడు చెబుతున్నాడు. కాగా గుప్త అదృశ్యమై బుధవారానికి 9 రోజులు అవుతుంది.