
అరకొరగా ప్రసవాలు
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో తగ్గుతున్న సాధారణ కాన్పులు ● నెలకు 200 ప్రసవాలు జరగాల్సి ఉన్నా 80 దాటని వైనం ● ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న గర్భిణులు
సమస్యలు పరిష్కారమయ్యేనా...
టెక్కలి రూరల్ :
టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య ఆశించిన మేర పెరడగం లేదు. ప్రధానంగా సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ప్రాంతీయ ఆస్పత్రి నుంచి జిల్లా ఆస్పత్రిగా మారినప్పటికీ వైద్యసేవల్లో మాత్రం ఏమీ మార్పు రాలేదని, గతంలో మాదిరిగానే అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సీరియస్ కేసు వస్తే వెంటనే శ్రీకాకుళం రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రి కావడంతో పలాస, మెళియాపుట్టి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల నుంచి కేసులను టెక్కలి రిఫర్ చేస్తుంటే.. అందులో చాలా కేసులను ఇక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేస్తుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెంచడం దేనికని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇక్కడి వైద్యులు మాత్రం సరైన పరికరాలు లేకపోతే తామేం చేస్తామంటూ వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, ఇద్దరు అసిస్టెంట్ సివిల్ సర్జన్‌లు ఉన్నారు. వీరందరు మహిళ వైద్యులే. రోజుకు సుమారు 500పైగా వస్తున్న ఓపీలో 50కి పైగా ప్రసూతి విభాగానివే, అందులో 40 మంది వరకు గర్భిణులు వివిధ రకాల పరిక్షలు చేయించుకుంటున్నారు. అయినప్పటికి కాన్పుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. వివిధ కారణాల వల్ల నెలకు సుమారు 200 వరకు కాన్పులు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 80 కూడా దాటడం లేదు. అందులో సాధారణ కాన్పులు 30కు మించకపోవడం గమనార్హం.
స్థానికులు ఏమంటున్నారంటే..
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులే ప్రైవేట్ క్లినిక్‌లు నడిపించడం వల్ల వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు.
●గర్భిణులను ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకొచ్చాక ఆపరేషన్‌కు, బొడ్డు కొయ్యడానికి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, వార్డుకు తీసుకువెళ్లేందుకు.. ఇలా ప్రతిదానికీ కొందరు డబ్బులు అడుతున్నారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. ముర్రుపాలు పట్టించడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.
● కాన్పుకు ముందు చేయాల్సిన పరీక్షలన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుని ప్రసవానికి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారని, ఇందులో కొందరు సిబ్బంది పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● ప్రసవం అయ్యాక బాలింతలకు పూర్తిస్థాయిలో బెడ్‌లు లేవు.
టెక్కలి: టెక్కలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు వేధిస్తున్నాయి. పేరుకు పెద్దాసుపత్రి అయినప్పటికీ సేవల విషయంలో రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం విషయంలో పాలనా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ఆసుపత్రిలో వైద్యులు మొదలుకొని దిగువ స్థాయి సిబ్బంది కొరతతో పాటు మరి కొన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సేవలు అరకొరగానే అందుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆస్పత్రిలో అభివృద్ధి సలహా సమావేశం నిర్వహించనున్నారు. గత ఏడాది ఆగస్టు 1న మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో కలెక్టర్ నేతృత్వంలో ఆస్పత్రి అభివృద్ధి సలహా సమావేశం నిర్వహించారు. అప్పట్లో పలు సమస్యలపై విన్నవించారు. వాటిలో ఆశించిన స్థాయిలో పరిష్కారం కాలేదు. ఈసారైనా చర్యలు చేపడతారో లేదో చూడాలి.
ప్రధాన సమస్యలివే...
టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. డెర్మటాలజీ, జనరల్ మెడిషిన్, రేడియాలజీ, జనరల్ సర్జన్, ఎనస్తీషీయా, ఆర్‌ఎంఓ, డీసీఎస్ జనరల్, సీఏఎస్ జనరల్ వైద్యులు కలిపి 10 మంది వైద్యులు అవసరం. 15 మంది స్టాఫ్ నర్స్‌ల కొరత వేధిస్తోంది. జీడీఏలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అటెండర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాంగణంలోనే మార్చురీ విభాగం ఉండడంతో మృత దేహాల భద్రత జఠిలమైన సమస్యగా మారింది. సరైన మురుగు వ్యవస్థ లేకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు నీరు ప్రవహిస్తోంది.
టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రిలో డబ్బులు తీసుకుంటున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఆస్పత్రిలో వార్డులు కొన్నిసార్లు సరిపడటం లేదన్న విషయం వాస్తవమే. దానికి తగ్గట్టుగా ఆరోగ్యం బాగున్న వారిని వేరే వార్డులోకి షిప్ట్ చెయ్యిస్తున్నాం
– బి.సూర్యారావు,
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, టెక్కలి

అరకొరగా ప్రసవాలు

అరకొరగా ప్రసవాలు

అరకొరగా ప్రసవాలు